సాక్షి, చిత్తూరు:
జిల్లాలో మూడవరోజూ ప్రజానీకానికి విద్యుత్ కష్టాలు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా జిల్లా మొత్తం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు విద్యుత్‌సరఫరా నిలిపేశారు. దీంతో జిల్లాలో అన్ని రకాల వ్యాపారలావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. వేలాది లీటర్ల పాలు నిల్వచేసుకునే పరిస్థితి లేక పాలసేకరణ తగ్గించాయి. పరోక్షంగా ఈ ప్రభావం పాడిరైతులపైన పడింది. విద్యుత్ ఆధారంగా నిర్వహించే దుకాణాలు, చిన్నతరహా పరిశ్రమలు పూర్తిగా మూతేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె, కుప్పం, నగరి, పుత్తూరు ఏరియా ఆస్పత్రుల్లో విద్యుత్ లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. తిరుమలకు, తిరుపతిలోని ప్రధాన ఆస్పత్రులకు మాత్రం విద్యుత్ సరఫరా ఇచ్చారు.
మూడవ రోజు కూడా 2,500 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతిల్లో విద్యుత్‌జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే ట్రాక్షన్ విద్యుత్ రేణిగుంట వరకే ఉంది. రేణిగుంట-విజయవాడ మార్గంలో విద్యుత్‌సరఫరా పగటి పూట లేకపోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని మూడు 220 కేవీ సబ్‌స్టేషన్లు, 33 కేవీ సబ్‌స్టేషన్లు 295 పని చేయలేదు. ఇంజినీర్లు సమ్మెలో ఉన్నందున ఫీడర్లలో రాత్రి సమయాల్లో ఏర్పడిన బ్రేక్‌డౌన్లు, రిపేర్ల గురించి పట్టించుకోవటం లేదు.
దెబ్బతింటున్న పాలు, కూరగాయలు
విద్యుత్ సమ్మెతో కోల్డ్ స్టోరేజీల్లో, బీఎంసీల్లో, సూపర్‌మార్కెట్లలో పాలు, కూరగాయల నిల్వలు దెబ్బతింటున్నాయి. వేలాది లీటర్ల పాలు నిల్వ చేసుకునే పరిస్థితి లేక చెడిపోతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ డెయిరీలన్నీ పాలు నిల్వ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. మదనపల్లె కేంద్రంగా ఉన్న ఒకటి, అర కోల్డ్ స్టోరేజీల్లో కూరగాయలు, టమాటలు నిల్వచేసుకునే పరిస్థితి లేదు. దీనికితోడు జిల్లావ్యాప్తంగా చిల్లర దుకాణాల్లో రీటైల్‌గా పాలు విక్రయించేవారు తమవద్ద తక్కువ స్టాకు ఉంచుకుంటున్నారు. సాయంత్రం వరకు కూలింగ్ లేకుంటే పాలు చెడిపోతాయంటున్నారు. మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఎంసీలలో వందలాది లీటర్ల పాలు పాడయ్యాయి. 13 గంటలు కరెంట్ లేకపోవడంతో ఇళ్లలో ఫ్రిజ్జుల్లో నిల్వ చేసుకునే పదార్థాలను సైతం బయటపడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాత్రంతా జాగారమే!
పగటి పూట రక్షిత మంచినీటిపథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు రాత్రి పూట బిందెలు తీసుకుని వీధుల్లోకి వెళ్తున్నారు. అర్ధరాత్రి వరకూ కొళాయిల చుట్టూ చేరి నీళ్లు పట్టుకుంటున్నారు. వెల్డింగ్ దుకాణాల వారు రాత్రి సమయాల్లో పని చేస్తున్నారు. రాత్రి 7 గంటల తరువాతే జిరాక్స్, డీటీపీ సెంటర్లు కూడా తమ వ్యాపారం సాగిస్తున్నాయి. బ్యాంకుల్లో మాత్రం పరిమిత కంప్యూటర్లతో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బీఎస్‌ఎన్‌తో పాటు, కొన్ని ప్రైవేట్ సెల్‌కంపెనీలు కూడా జనరేటర్లు నిరవధికంగా నిర్వహించలేక టవర్లలో సిగ్నల్స్ ఆపేసే పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్, టీవీ చానళ్లు బంద్
విద్యుత్ సమ్మెతో పగటి పూట జిల్లాలో లక్షల సంఖ్యలో టీవీలు, ఇంటర్నెట్ కంప్యూటర్లు షట్‌డౌన్ అయ్యాయి. ముఖ్యంగా న్యూస్ చానళ్లు లేకపోవడంతో ప్రజానీకం హైదరాబాద్, ఢిల్లీలో జరిగే విషయాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని తమకు తెలిసినవారికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు.
కొనసాగుతున్న ‘విద్యుత్’ సమ్మె
Published Wed, Oct 9 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement