రోగులకు సమ్మె చీకట్లు
Published Fri, Oct 11 2013 3:23 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM
చీరాల, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విద్యుత్ జేఏసీ చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరడంతో కరెంట్ కష్టాలు తీవ్రమయ్యాయి. రోజూ ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. అలాగే రాత్రుళ్లు మధ్యమధ్యలో కరెంట్ తీయడంతో చేతివృత్తులు, చిరువ్యాపారులు, వ్యాపార సముదాయాలు, వైద్యశాలలు, మంచినీటి కేంద్రాలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో డీజిల్ కొరతతో జనరేటర్లు నిలిపి వేశారు. అత్యవసర వార్డుల్లో ఉన్న ఇన్వర్టర్లు సైతం పని చేయడం లేదు. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన సీమాంక్ సెంటర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఉన్న బాలింతలు, పసి పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గదుల్లోకి గాలి రాకపోవడంతో ఉక్కపోత, ఊపిరి ఆడకపోవడంతో బాలింతలు, చిన్న పిల్లలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
దీంతో వార్డుల్లో ఉండాల్సిన వారు ఆరుబయటకు వచ్చి చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రోగుల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లోని వార్డుల్లో ఉండలేక చాలా మంది రోగులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ చీరాల ఏరియా వైద్యశాలే దిక్కు. పేదలు, మధ్య తరగతి వారు నిత్యం వివిధ రకాల చికిత్సల కోసం చీరాల ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. వంద పడకల ఆస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో ప్రసూతి, కాన్పుల విభాగం, చిన్న పిల్లలకు ఐసీయూకేర్ యూనిట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పలు రకాల శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు రోగులకు ప్రత్యేకంగా వార్డు సదుపాయాలున్నాయి.
పదుల సంఖ్యలో వైద్యులు, వందల సంఖ్యలో వివిధ విభాగాల సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ధర్మాస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో వసతులు మాత్రం ఆశించిన మేర రోగులకు అందడం లేదు. విద్యుత్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. విద్యుత్ కోతలతో జనరేటర్ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించకపోవడంతో శస్త్ర చికిత్సలు, కాన్పులు చేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలను కూడా సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలానే వ్యవసాయ సీజన్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి సాగవుతోంది. అయితే విద్యుత్ సరఫరా లేక రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement