సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే ఒక్కో సేవను ప్రైవేట్‌పరం చేస్తూ ఉద్యోగుల పొట్టకొడుతున్న విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ట్రస్టుకే చిల్లు పెట్టేశాయి. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఉద్యోగుల ట్రస్టు నిధులను దీని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెన్‌కో తన సొంతానికి వాడుకుంది. 25 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ కోసం భద్రపరచిన సొమ్మును జెన్‌కో సొంత అవసరాలు, సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చెల్లింపులు తదితరాలకు వినియోగించడం ఆందోళనకు దారి తీస్తోంది.
సిబ్బంది సంక్షేమానికి తూట్లు
ఉద్యోగుల పింఛన్ల కోసం భద్రపరిచిన రూ.1,500 కోట్లను జెన్‌కో ఇప్పటికే వినియోగించగా నాలుగేళ్లుగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ వాటాగా విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.500 కోట్లను ఇవ్వకుండా వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. జెన్‌కోతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులందరికీ ఈ ట్రస్టు ద్వారానే పింఛను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల స్థూల వేతనంలో 9 శాతం చొప్పున సిబ్బంది సంక్షేమం కోసం మూడు విభాగాల నుంచి ట్రస్టుకు జమ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా సుమారు రూ.500 కోట్లను డిపాజిట్ చేయకుండా జెన్‌కో అవసరాలకు వినియోగించారు.
మళ్లీ నిర్వీర్యం చేసే చర్యలు మొదలు..
ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా జెన్‌కోకు డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఎస్‌ఏ) రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సర్దుబాటు చార్జీల రూపంలో డిస్కంల నుంచి రావాల్సిన మొత్తాన్ని కాగితాల్లో మాత్రం ట్రస్టు నిధులుగా చూపుతున్నట్టు సమాచారం. విద్యుత్ సంస్కరణలో సమయంలో డిస్కంలను ప్రైవేట్‌పరం చేస్తారని, జెన్‌కోకు చెందిన ఒక్కో ప్లాంటును విక్రయిస్తారని అప్పట్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత జెన్‌కోకు ప్రభుత్వ గ్యారంటీతో నిధులు ఇవ్వడంతో పాటు భారీగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని జెన్‌కో ఆధ్వర్యంలో చేపట్టారు. అంతేకాకుండా డిస్కంల ప్రైవేటీకరణ ఆలోచనను తిరస్కరించడంతో పాటు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలు మొదలయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై జెన్‌కో ఎండీ కె.విజయానంద్‌ను సంప్రదించగా.. ట్రస్ట్ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం లేదన్నారు.
ఏమిటీ ట్రస్టు..?
గతంలో విద్యుత్ సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) పేరుతో మనుగడలో ఉండేవి. 1999లో ఏపీఎస్‌ఈబీని చంద్రబాబు ప్రభుత్వం ముక్కలు చేసింది. ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లుగా మూడు ముక్కలు చేసింది. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులకు మెరుగైన జీతాలు, హోదాతోపాటు పింఛన్లు కూడా ఇస్తామని ఈ సందర్భంగా హామీలను గుప్పించింది. ఈ మేరకు ఏపీఎస్‌ఈబీ, ప్రభుత్వం, ఉద్యోగులకు 1999లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పెన్షన్ నిధికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో రూ.4 వేల కోట్లతో ఈ ట్రస్టు ఏర్పాటైంది. ఏపీఎస్‌ఈబీ హయాంలో ఉద్యోగం పొందిన చివరి సిబ్బంది పదవీ విరమణ చేసేవరకూ ఈ ట్రస్టును మనుగడలో ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2033 వరకూ ఈ ట్రస్టు మనుగడలో ఉండనుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రస్టులో రూ. 2,500 కోట్ల మేర నిధులున్నాయి. ఇందులో నుంచి ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు వినియోగించారు.
Comments
Please login to add a commentAdd a comment