సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజావసరాలకు సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేస్తే.. ప్రస్తుత సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలకే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కోకు ఊతమిస్తోంది. 2021–22లో సింహభాగం విద్యుత్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్థ ఏపీ జెన్‌కోను మరింత బలోపేతం చేయాలని నిర్ధేశించింది. ఈ దిశగానే ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలను సమర్పించాయి. చౌక విద్యుత్ తీసుకోవడంతోపాటు కొన్నేళ్లుగా చిక్కి శల్యమైన ఏపీ జెన్‌కోకు ఊపిరి పోయాలని నిర్ణయించాయి.
చరిత్రను తిరగరాస్తూ..
2019 వరకూ ఏపీ జెన్‌కోలో విద్యుత్ ఉత్పత్తి ఏటా సగానికి సగం తగ్గింది. కొన్ని ప్రైవేట్ సంస్థల జేబులు నింపేందుకు జెన్‌కో ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే విమర్శలున్నాయి. ఈ చరిత్రను తిరగరాస్తూ.. 2021–22 సంవత్సరంలో జెన్‌కో, కేంద్ర విద్యుత్‌కే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 68,368.43 మిలియన్ యూనిట్ల (ఎం.యూల) విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో 71,380.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అనుకోని పరిస్థితులు వస్తే అధిగమించేందుకు మిగులు విద్యుత్‌నూ సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో ఏపీ జెన్‌కోకు చెందిన బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచి 36,475.56 ఎంయూలు, జల విద్యుత్ ప్లాంట్ల నుంచి 2,796.91 ఎంయూలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఏపీ జెన్‌కో వాటా ఉన్న అంతర్ రాష్ట్ర జల విద్యుత్ ప్లాంట్ల నుంచి మరో 415.77 ఎంయూలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఏపీ జెన్‌కో నుంచి 2021–22లో 39,688.24 ఎంయూలు విద్యుత్ తీసుకోబోతోంది. దీంతోపాటు 13,495.85 ఎంయూలను కేంద్రం నుంచి తీసుకుంటుంది. అంటే.. కేంద్ర, రాష్ట్ర విద్యుత్ కలిపి 53,184.09 ఎంయూలు ఉంటుంది. ఇక ప్రైవేట్ విద్యుత్ వాటాను కేవలం 16,196.86 ఎంయూలకు పరిమితం చేశారు. ఇది కూడా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల విధిలేని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటు విద్యుత్‌కు దీటుగా.. రూపొందించిన ప్రణాళికలో ఏ నెలలోనూ విద్యుత్ సరఫరాకు ఢోకా ఉండదని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment