సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్‌టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్‌కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది.
తగ్గనున్న కొనుగోళ్లు
ఏపీ జెన్‌కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్‌కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్‌కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్‌కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు
విజయానంద్
గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్‌కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్‌కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్‌టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్‌ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు.
ట్రయల్ రన్‌లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్‌కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్‌ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment