
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 25 నుంచి 31 వరకు 773 జిల్లాల్లోని 1,546 ప్రాంతాల్లో ఈ వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంలోనూ వీటి నిర్వహణకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కార్యక్రమాలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ), మిగిలిన జిల్లాల్లోని కార్యక్రమాలకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ఆదివారం లేఖ రాశారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నోడల్ అధికారిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2047 నాటికి విద్యుత్ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలతో కూడిన విజన్‌ను ఈ వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు బీఈఈ తెలిపింది.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం
‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.34 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
స్వతంత్ర పోరాటంతో సంబంధమున్న గ్రామాలు, ఇటీవల విద్యుద్దీకరణ జరిగిన గ్రామాల్లో ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో ఎండీ బి.శ్రీధర్, జేఎండీ పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు, నెట్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment