సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్లవల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి నష్టంలేదని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయడంపై పలు పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు.
ఆ కథనాల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ.. స్మార్ట్మీటర్లవల్ల కలిగే ప్రయోజనాలను, ఈ ప్రాజెక్టులోని వాస్తవాలను ఆయన వివరించారు. విజయవాడ విద్యుత్ సౌథలో గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, సెంట్రల్ డిస్కం సీఎండీ పద్మాజనార్ధనరెడ్డిలతో కలిసి మంగళవారం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ముందుగా 18.56 లక్షల వ్యవసాయ, హైవాల్యూ.. అంటే నెలకు 500 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం ఉన్న 27.68 లక్షల సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం అదే ఏడాది నిర్ణయించింది. అలాగే. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని 2020లో డిస్కంలకు ఆదేశాలు జారీచేసింది.
టెండర్ల కోసం దేశమంతా ఒకే నిబంధనలతో ఒక డాక్యుమెంట్‌ను కేంద్రమే రూపొందించింది. దాని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. పైగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్ల ఖరారు జరుగుతుంది. మరోవైపు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గానే ఉంది.
ఐఆర్‌డీఏ, బ్లూటూత్, స్మార్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ మీటర్లను ఆయా ప్రాంతాల్లో వెసులుబాటులను బట్టి ఏర్పాటుచేసేలా టెండర్లు రూపొందించాం. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మీటర్ ఒక్కటే పెట్టడంతో సరిపెట్టకుండా రైతుల ప్రాణరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన పరికరాలను (అలైడ్ మెటీరియల్) ఆర్థికంగా భారమైనా మీటర్లతో పాటు ఏర్పాటుచేయనున్నాం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్‌మీటర్‌తో పాటు (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ)తో కూడిన ఫ్యూజ్‌బాక్స్‌నూ అందిస్తున్నాం.
ముట్టుకున్నా షాక్ కొట్టని బాక్స్‌ను అందిస్తున్నాం. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు ఉండవు. మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే, ఎర్తింగ్ రాడ్‌ను కూడా ఏర్పాటుచేస్తాం.
గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్త పడొచ్చు
ఇక ప్రస్తుతం గ్రామాల్లో పొలాల మధ్య ఉండే వ్యవసాయ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేయడం శ్రమతో కూడుకున్నది కావడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పూర్తి ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌మీటర్లను ఇస్తున్నాం. అలాగే..
– వీటి ద్వారా మోటార్ ఆన్, ఆఫ్ చెయ్యొచ్చు. రైతు పొలానికి వెళ్లి మోటారు స్విచ్చాన్ చేయాల్సిన అవసరం ఉండదు.
– భవిష్యత్‌లో గ్రిడ్‌పై పడే లోడ్‌ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్‌మీటర్ల ద్వారానే వీలవుతుంది.
– అదే విధంగా ఎప్పటికప్పుడు లోడ్‌ను మోనిటర్ చేస్తూ గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్తపడొచ్చు.
– తద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు.
– పైగా ఒక ట్రాన్స్‌ఫార్మర్‌పై రెండు, మూడు సర్వీసులుంటే అన్ని సర్వీసులకూ ఒకే విధమైన వినియోగం జరగదు. అందరిదీ కలిపి ఒకే రీడింగ్ చూపిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుంది.
పైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు
మరోవైపు.. స్మార్ట్ మీటర్లపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిచ్చింది. ప్రయాస్ అనే సంస్థ 20 శాతం విద్యుత్ ఆదా అయినట్లు తేల్చింది. మేం అన్ని సర్వీసులపైనా అధ్యయనం చేశాం. 33 శాతం విద్యుత్ అదా కనిపించింది. ఇక రాష్ట్రంలో 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వాడుతున్నారు.
ఇందులో 20 శాతమే ఆదా అనుకుంటే రూ.1,900 కోట్లు, 33 శాతం అయితే రూ.3,600 కోట్లు మిగులుతాయి. మీటర్లు పెట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడి ఒకటి, రెండేళ్లలోనే వచ్చేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే స్మార్ట్ మీటర్లపై ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులు కూడా ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment