సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment