telangana transco cmd
-
రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును గన్‌పార్క్ వద్ద బహిరంగంగా కాల్చిచంపినా తప్పులేదన్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఎంపీ వాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం మింట్‌కాంపౌండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వారంతా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. నిజాయితీ పరుడైన ట్రాన్స్‌కో సీఎండీ ని కాల్చిచంపాలని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తన వాఖ్యలను ఉపసంహరించుకుని, సీఎండీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్ విద్యుత్ సంస్థలపై అడ్డగోలు ఆరోపణలు చేసి, వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సంఘాలతోపాటు 2వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థల్లో ‘బినామీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
ఏపీ నుంచి టీ విద్యుత్ ఉద్యోగులు వెనక్కి!
రిలీవ్ చేయకున్నా వెనక్కి తీసుకోవాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వశాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులంతా జూన్ 27 నాటికి ఏపీ కొత్త రాజధాని అమరావతికి రావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమను రిలీవ్ చేయాలంటూ నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అమరావతికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ విద్యుత్ సంస్థలు తమ ప్రాంత ఉద్యోగులను వెనక్కి తీసుకుంటే విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది జూన్ 10న తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ప్రాంత ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులో వేర్వేరుగా విచారణ జరుగుతోంది. త్వరలో ప్రభుత్వానికి చెబుతాం ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేసినా చేయకపోయినా వారిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. 280 మంది తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు ఏపీలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. త్వరలో ప్రభుత్వానికి తెలిపి చర్యలు తీసుకుంటాం. - డి. ప్రభాకర్‌రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ