Benami contractors
-
మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.61 కోట్ల జరిమానా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీలను బినామీల పేరిట లీజుకు పొందారు. అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న ఆయన ఇన్నేళ్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి క్వారీల వైపు రాకుండా తన చీకటి వ్యాపారాన్ని సాగించారు. ఇటీవలే గనులశాఖ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌ను తనిఖీ చేసి రోడ్డు మెటల్ నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించి రూ.1.60 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. తాజాగా మాజీ ఎమ్మెల్యే బినామీ పేరిట ఉన్న రోడ్డు మెటల్ క్వారీని గనుల శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి.. అక్రమ తవ్వకాలను గుర్తించింది. అనంతపురం టౌన్: క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్‌ను తన క్రషర్కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. రూ.61.35 కోట్ల జరిమానా.. మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినా ఆగని ఖనిజ రవాణా జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి తవ్వకాలు క్వారీ లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించాం. దాదాపు 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మెటల్ తరలించారు. దీంతో క్వారీ నిర్వాహకుడు సాంబశివుడికి రూ.61.35 కోట్ల జరిమానా విధించి క్వారీని సీజ్ చేశాం. సీజ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు. మరోమారు క్వారీని పరిశీలిస్తాం. అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసుకు సిఫార్సు చేస్తాం. – నాగయ్య, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
కోటరీ కోరినట్టే టెండర్లు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల టెండర్లకు ఓ విధానం అంటూ లేకుండా కోటరీ, బినామీ కాంట్రాక్టు సంస్థలు కోరినట్లుగా ప్రభుత్వ పెద్దలు కట్టబెడుతున్నారు. ఏ విధానంలో తమకు ఎక్కువ లాభదాయకమో అదే విధానాన్ని ఎంచుకుంటున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి సమీకరించిన భూముల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇప్పటికే రెండు విధానాల్లో టెండర్లను ఆహ్వానించిన పెద్దలు కోటరీ సంస్థలు ఎంపిక కాకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. కోటరీ, బినామీ సంస్థలు కోరిన విధానంలో లంప్సమ్ పర్సెంటేజ్ విధానంలో టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఎస్కలేషన్ క్లాజు విధించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించిన టెండర్లలో ఎస్కలేషన్ క్లాజు విధించరు. ఈపీసీ విధానంలో కూడా ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అయితే లంప్సమ్ విధానంలో ల్యాండ్ పూలింగ్ స్కీములో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో సీఆర్డీఏ ఎస్కలేషన్ క్లాజును విధించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. అదనపు పని... అదనంగా బిల్లులు ల్యాండ్ పూలింగ్ స్కీములోని ఐదు జోన్లలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. లంప్సమ్ పర్సంటేజ్ విధానం అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత మేర అదనంగా నిధులను చెల్లించడం. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అదనంగా పనులను చేపడితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోటరీ కాంట్రాక్టర్లకు భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించి కమీషన్లు కాజేసేందుకే ఎస్కలేషన్ క్లాజు తెరపైకి తెచ్చారనే విషయం స్పష్టం అవుతోందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు ల్యాండ్ పూలింగ్ స్కీముల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.5,784.20 కోట్ల విలువైన పనులకు లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈనెల 22వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాంకేతిక బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్ ఈ నెల 28వ తేదీన తెరుస్తారు. హైబ్రీడ్ యాన్యుటీ అంటే... హైబ్రీడ్ యాన్యుటీ విధానం కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సొమ్మును నిర్మాణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 60 శాతం వ్యయం ప్రైవేట్ డెవలపర్ భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం సొమ్ము చెల్లించేందుకు అంగీకరించింది. 51 శాతం డెవలపర్ భరిస్తాడని పేర్కొంది. ఇది హైబ్రీడ్ యాన్యుటీ విధానానికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రైవేట్ డెవలపర్ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు ఏటా రెండు వాయిదాల్లో చెల్లించాలి. అప్పటివరకు ఉన్న వడ్డీకి అదనంగా మూడు శాతం కలిపి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంది. అయితే తదుపరి ప్రభుత్వం ఈ టెండర్లను రద్దుచేస్తే తమ పరిస్థితి ఏమిటని కోటరీ సంస్థలు ప్రశ్నించడంతో సీఆర్డీఏ ఆ టెండర్లను రద్దు చేసింది. కోటరీ కోరికపై ఈపీసీ రద్దు! ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించినా కోటరీ సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందులో ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అంతేకాకుండా టెండర్లలో పేర్కొన్న అంతర్గత అంచనా వ్యయంపై ఐదు శాతం కన్నా ఎక్కువగా కోట్ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోటరీ సంస్థలు మనసు మార్చుకుని ఈపీసీ విధానంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరాయి. దీంతో సీఆర్డీఏ వీటిని రద్దు చేసి కోటరీ కోరిక మేరకు మూడోసారి లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో ఎస్కలేషన్ క్లాజుతో టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్ల పాటు నిర్వహణ... - జోన్–4 కింద పిచ్చుకలంక, తుళ్లూరు, అనంతవరంలోని 843.66 ఎకరాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ స్కీములో రహదారులు, వంతెనలు, డ్రైన్స్ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.563.16 కోట్లతో లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్లలో మౌలిక వసతులను కల్పించి ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. - జోన్–12 కింద కురగల్లు, నవులూరు, నిడమానూరులో 2,748.68 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,600.15 కోట్లతో టెండర్లను పిలిచారు. - జోన్–12 ఏ కింద కురగల్లు, నిడమానూరులో 2,155.79 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,154.35 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. - జోన్ 9, 9 ఏ కింద ఐనవోలు, నేలపాడు, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం పరిధిలోని 1,811.39 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.2,466.54 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. కొత్త సర్కారు వస్తే? రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీము జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలుత హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో అక్రమాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం, పలువురు విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయడంతో కోటరీ సంస్థలు ఈ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగు వేశాయి. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో లొసుగులు, లోపాలను తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం తప్పుబట్టి దర్యాప్తునకు ఆదేశిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి. దీనికి సీఆర్డీఏ, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పలేకపోయారు. -
విద్యుత్ సంస్థల్లో ‘బినామీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
పనీ మాదే.. పైసా మాదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు! కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్సులు పొంది లక్షలు కొల్లగొడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో పనులను చేజిక్కించుకొని సర్కారు సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. కొందరు అధికారులైతే తమ బినామీల కోసమే అడ్డగోలుగా పనులకు అంచనాలు రూపొందించి తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. పనుల అంచనాల తయారీ, ఓపెన్ టెండర్ల నిర్వహణ, నామినేషన్ల కింద పనుల కేటాయింపు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ, బిల్లుల జారీ అధికారం.. ఇలా అంతా తమ చేతుల్లోనే ఉండటంతో ఈ అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తల్లి, భార్య, బావమరిది, సోదరుడు, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మేనకోడలు, ఇతర సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్స్‌లు పొంది అడ్డదారిలో రూ.లక్షల విలువైన పనులను దక్కించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకుని కొందరు పనుల అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నా సంస్థ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ట్రాన్స్‌కో, దక్షిణ/ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న ఓ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు పలువురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ), అదనపు డివిజినల్ ఇంజనీర్లు(ఏడీఈ), డివిజినల్ ఇంజనీర్లు(డీఈ), అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లు, ఇతర స్థాయిల ఉద్యోగులు సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టు పనులు చేస్తుండగా, మరికొందరు అమ్యామ్యాలు తీసుకుని బంధువులకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులెవరూ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా లేరని ప్రతి పనికి సంబంధించిన టెండరు దాఖలు సందర్భంగా కాంట్రాక్టర్లు రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యులెవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా తేలితే కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు సంస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులకు రూ.5 లక్షలలోపు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీంతో వారే కాంట్రాక్టులు దక్కించుకుంటూ, పనులు మంజూరు చేసుకుంటున్నారు. అలాగే కింది స్థాయి అధికారుల బినామీలకు సైతం పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రకటన లేకుండానే నామినేషన్లు రూ.5 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులకు ఆన్లైన్ టెండర్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన పనులను ఓపెన్ టెండర్ల విధానంలో నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అనుమతిచ్చింది. అత్యవసరంగా నిర్వహించాల్సిన పనులకు ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకునే కొందరు విద్యుత్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల దందాకు తెరలేపారు. నామినేషన్ల విధానంలో చేపట్టే పనులకు తొలుత ఓపెన్ టెండరు ప్రకటనను విడుదల చేయాలి. ఆ తర్వాత కనీసం ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లను స్వీకరించాలి. అందులో తక్కువ రేటు సూచించిన వ్యక్తికి అర్హతల ప్రకారం పనులు అప్పగించాలి. అయితే నామినేషన్ల కింద చేపట్టే పనులకు చాలాచోట్ల బహిరంగ టెండరు ప్రకటన జారీ చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పనులను బినామీలకు కేటాయించుకుంటున్నారు. తెలిసిన ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లు తెప్పించుకుని, వాటిలో తమ బినామీ కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ దక్కేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో పోలిస్తే బినామీ కాంట్రాక్టర్‌కు సంబంధించిన కొటేషన్లో రేటును క్తాస తగ్గించి పనులను చేజిక్కించుకుంటున్నారు. చాలా కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నామినేషన్ల కింద పనుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన 15 రోజుల తర్వాత ఓపెన్ టెండరు ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం(ఐపీడీఎస్) పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. వీటితోపాటు ఇతర పథకాల కింద రూ.5 లక్షల లోపు అంచనా వ్యయంతో నామినేషన్‌పై కేటాయిస్తున్న పనుల్లో ఎక్కువ శాతం అధికారుల బినామీ కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తమకు పనులు దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. -
పేదల శ్రమను దోచుకుంటారా?
ప్రొద్దుటూరు టౌన్ : నాడు పేదల ఓట్ల కోసం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజలను అప్పుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే 36గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ పద్ధతిలో నాసికరంగా ఇళ్లు నిర్మిస్తున్నారని వివరించారు. లబ్ధి దారులను నుంచి తక్షణమే ఒకరకం ఇంటికి రూ.50 వేలు, మరో రకం ఇంటికి రూ.లక్ష డిపాజిట్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.3 లక్షలకు లబ్ధిదారుని వాటా కలిపితే రూ.4లక్షలు అవుతుందన్నారు. చదరపు అడుగుకు రూ.1,000 నుంచి రూ.1,200 ఖర్చుచేస్తే రూ.3.50 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. కానీ ప్రభుత్వం తన బినామీ కాంట్రాక్టర్‌కు చదరపు అడుగుకు రూ.2,140 ఇస్తోందని, ఈ విధంగా ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు దండుకుంటున్నారన్నారు. ఈ విధంగా ఒక్క ప్రొద్దుటూరులోని 4 వేల ఇళ్ల నిర్మాణంలో రూ.120 కోట్ల పేదల సొమ్ము లోకేశ్‌బాబు చెంతకు చేరుతోందన్నారు. పేదలను అప్పులపాలు చేసేందుకే.. ఒక్కో లబ్ధిదారునికి బ్యాంకుల నుంచి రూ.లక్షలు అప్పు ఇప్పించి 70 పైసల వడ్డీతో ప్రతినెల రూ.4వేల నుంచి రూ.5వేలు బ్యాంకుకు చెల్లించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈవిధంగా చివరకు రూ.17లక్షల నుంచి రూ.18 లక్షలు పేదోడిపై భారం పడుతోందని తెలిపారు. ఇదేనా పేదల సొంతింటి కల నిజం చేసే విధానం అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ అక్క చెల్లెమ్మలకు చెప్పకుండా అబద్ధాలు చెప్పి అప్పులఊబిలో నెడుతున్నారని తెలిపా రు. బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే నోటీసులు జారీ చేసి ఇంటిని జప్తు చేసి వారిని కోర్టుల చుట్టూ తిప్పుతారని పేర్కొన్నారు. తాను చేసిన ఈ ప్రకటనలో ఒక్క అక్షరం తప్పని చెప్పి టీడీపీకి వలస వచ్చిన మంత్రులు నిరూపిస్తే దీక్షను విరమిస్తానని అన్నారు. లేదంటే ఇదే అక్క చెల్లెమ్మలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల బలంతో ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు 2019లో వైఎస్సార్సీపీకి అధికారం కల్పించిన పిమ్మట జగన్ ప్రభుత్వంలో 2సెంట్ల స్థలంలో స్వతంత్ర ఇంటిని నిర్మించి ఆడబిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పేదల పట్ల పెద్ద హృదయంతో మెలగాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతాం ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ప్రజలు అండగా నిలవాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్ని నియోజకవర్గాల్లో దూసుకెళుతుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చే విధంగా పోరాడతామన్నారు. -
పచ్చపాతం!
ఉద్యానవనశాఖలో వేళ్లూనుకున్న అవినీతి బినామీ కాంట్రాక్టర్లతో అధికారుల ఇష్టారాజ్యం విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ఉద్యానవన శాఖ పనుల్లో అవి నీతి చిగుళ్లు తొడుగుతోంది. బినామీ కాంట్రాక్టర్ల పేరిట అధికారులే ఎడాపెడా పనులు దక్కించుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఇతర కాంట్రాక్టులెవరికీ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా పనులు చేజి క్కించుకుంటున్నారు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేస్తున్నారంటే అదీ లేదు. తూతూ మంత్రంగా పనులు చేసేసి బిల్లులు డ్రా చేసుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న తీరు ఇలా ఉంది...! లాసన్స్ బే కాలనీలో బీచ్ వద్ద పార్కు అభివృద్ధికి రూ. 80.39 లక్షల విలువతో గత ఏడాది టెండర్లు పిలిచారు. ఇందులో ప్రధానమైనవి రూ. 49 లక్షలతో చేపట్టాల్సిన పార్కు పనులు. ఇందులో పచ్చిక తివాచీ(లాన్), పూల మొక్కలు, కొరియన్ కార్పెట్‌తో కూడిన ల్యాండ్ స్కేపింగ్ పనులు. కాగా ఈ టెండర్‌ను కూడా బినామీ పేరుతో అధికారులు చేజిక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ. 49 లక్షల పార్కు పనులకు టెండర్లు పిలిస్తే పలువురు పోటీపడే అవకాశం ఉంటుంది. అందుకే మరికొన్ని సివిల్ పనులను కూడా కలిపి అంచనా వ్యయాన్ని రూ. 80.39 లక్షలకు పెంచేశారు. ఆ పనులు దక్కించుకునేందుకు తమకు సన్నిహితుడైన పి.శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్‌ను రంగంలోకి తెచ్చారు. వాస్తవానికి ఆయనకు ల్యాండ్ స్కేపింగ్ పనుల్లో తప్ప మిగిలిన పనుల్లో ఎలాంటి అనుభవం లేదు. కానీ ఆయనకు అర్హత క ల్పించేందుకు కేవలం రెండు మాసాల వ్యవధిలో తొమ్మిది పనులు చేసినట్టుగా రికార్డులు జత చేశారు. ఒకే కాంట్రాక్టర్ రెండు నెలల్లో తొమ్మిది పనులు పూర్తి చేయడం అసాధ్యం. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు రూ. 80.39 లక్షల పనుల టెండర్‌ను ఖరా రు చేసేశారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కొన్నాళ్లు ఫైల్‌ను తొక్కిపెట్టారు. తర్వాత చడీచప్పుడు కాకుండా ఆ పనులను పి. శ్రీనివాస్‌కే క ట్టబెట్టారు. ముందుకు సాగని పనులు కాంట్రాక్టు దక్కించుకోవడం మీద చూపించిన శ్రద్ధ... పనులు పూర్తి చేయడం మీద మాత్రం అధికారులకు లేకుండా పోయింది. దాదాపు ఏడాది కావస్తున్నా లాసన్స్ బే కాలనీ బీచ్ పార్కు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇంత వర కూ కేవలం ఎర్రమట్టిని వేసి చేతులు దులుపుకున్నారు. పచ్చిక తివాచీ, పూలమొక్కలు, కొరియన్ కార్పెట్‌తో ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు ఊసే లేకుండా పోయింది. ఇవి కూడా..!: జీవీఎంసీ ఉద్యానవన శాఖలో ఆది నుంచీ ఇదే రీతిలో అవినీతిపర్వం కొనసాగుతోంది. అధికారులకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయకుండా బిల్లులు చెల్లించేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలివిగో..! 15వ వార్డు నుంచి 22వ వార్డు వరకూ రూ. 3.4 లక్షలతో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అసలు జరగనే లేదు. 32వ వార్డు చాకలిపేట హిందూ శ్మశానం పక్కన పార్కు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఆ ఫైలును మాయం చేశారు. తమ సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు మళ్లీ పనులు అప్పగించి బిల్లులు డ్రా చేసుకున్నారు. జీవీఎంసీ నర్సరీలో గత నాలుగేళ్లలో మొక్కల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు రూ. 25లక్షలు విలువైన మొక్కలు జాడ లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఉద్యానవన శాఖలో ఓ అధికారి తన సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు 2012-13, 2013-14లో ఏకంగా రూ. 80 లక్షల వి లువైన పనులను ఏక పక్షంగా కట్టబెట్టా రు. ఇంత అవినీతి జరుగుతున్నా ఉద్యానవన శాఖను సంస్కరణకు జీవీఎంసీ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
ఉపాధికి ఎసరుతెచ్చే పథకం!
పల్లెసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసమంటూ తొమ్మిదేళ్లక్రితం అమల్లోకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఏ)అటకెక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. పనిచేసే హక్కునూ, జీవనభద్రతనూ కలగజేసే ఉద్దేశంతో 2006లో ఈ పథకానికి పురుడు పోసి, చట్టబద్ధతనుకూడా కల్పించిన యూపీఏ సర్కారే... క్రమేపీ దాని ఊపిరి తీసే ప్రయత్నం చేయగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 650 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇకపై వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు పథకరచన సిద్ధమైందన్న కథనాలు ఇటీవలికాలంలో వెలువ డుతున్నాయి. దానికితోడు వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి నిష్పత్తిని ఇప్పుడున్న 60:40నుంచి 51:49కి మార్చదల్చుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచన మంచిదికాదని...పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చేయ త్నాలు చేయడంవల్ల పల్లెసీమలు మళ్లీ ఆకలితో నకనకలాడతాయని ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో ఇప్పటికే హెచ్చరించారు. ఉపాథి హామీ పథకం సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగ లిగారు. ఉన్న ఊరునూ, అయినవారినీ విడిచిపెట్టి పొట్టచేతబట్టుకుని ఎక్కడె క్కడికో వలసపోవలసివచ్చే దిక్కుమాలిన రోజులుపోయి ఉన్నచోటనే వారికి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్లో ఆసరాగా నిలిచింది. లబ్ధిదారుల్లో సగంకంటే ఎక్కువమంది దళిత కులాలకు చెందినవారుగనుక ఆ వర్గాలకు ఎంతో ప్రయోజ నకరంగా మారింది. పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు రెట్టింపయ్యాయి. రోజుకు రూ. 120 వచ్చేచోట రూ. 250 వరకూ రావడం మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది. పథకానికయ్యే వ్యయంలో కేంద్రానిది 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతంకాగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఈ పథకం వాటా 0.3 శాతం. అయితేనేం ఇది ఏటా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా మూడు నెలలపాటు భరోసా కల్పించింది. శ్రమదోపిడీనుంచి వారిని కాపాడింది. పథకం కింద చేసే పనుల్లో వేతనాల వాటా ఖచ్చితంగా 60 శాతం ఉండాలన్న నిబంధనవల్ల శ్రామికులకుఎంతగానో మేలు కలిగింది. బెంగళూరు ఐఐఎం 2009లో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ప్రభావంపై సర్వే చేసినప్పుడు అక్కడ వలసలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల్ని చేపట్టడంలో, అవతవకలు జరిగినచోట రికవరీలు చేయడంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముందుందని సర్వే తేల్చింది. ఈ పథకంవల్లనే యూపీఏ 2009లో వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత యూపీఏ సర్కారు దీని పీకనొక్కడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఎన్నికలు లేవుగదానన్న భరోసాతో కేటాయింపులను కత్తిరించడం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులో అలవిమాలిన జాప్యమూ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పేద జనానికి ప్రభుత్వం రూ. 4,800 కోట్లు బకాయిపడిందని ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్ చెబుతున్నదంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో సులభంగానే అర్థమవుతుంది. అంతేగాదు...ఈ ఎనిమిదేళ్లలోనూ ఆ పథకానికి రూ. 33,000 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. బకాయి పడితే శ్రామికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్న చట్ట నిబంధన తర్వాత కాలంలో ఎగిరిపోయింది. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది. మరోపక్క అనేక రాష్ట్రాల్లో భారీయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు దారిమళ్లించాయి. ఈ ఎనిమిదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 2.60 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్ల రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే. పథకం అమలులో తగినంత జవాబుదారీతనం, పారదర్శకత ప్రవేశపెడితే ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా అనుత్పాదక పనులు చేపట్టిన పక్షంలో గట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరిస్తే మంచిదే. వ్యవసాయ పనులకు దాన్ని అనుసంధానించడం ఎలాగో ఆలోచించవచ్చు. సామాజిక ఆడిట్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయొచ్చు. ఇంకేమి సంస్కరణలు చేస్తే అది మరింతగా మెరుగుపడుతుందో చర్చించవచ్చు. కానీ, ఎలుకలు జొరబడ్డాయని కొంపకు నిప్పెట్టుకున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి మూలనపడేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది. అసలు దీన్ని చట్టంగా చేయడమేమిటి, పథకంగా ఉంచితే నష్టమేమిటని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రశ్నించారు. పథకం మొదలైననాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాబల్య వర్గాలు సణుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఆలోచనలు అలాంటి వర్గాల ప్రయోజనాలను నెరవేర్చేలా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టరూపంలో ఉన్నది గనుక పార్లమెంటులో చర్చ తర్వాతే దానికి సవరణలు సాధ్యమవుతాయి. పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చడం చేయక దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడమెలాగో ప్రభుత్వం ఆలోచించాలి.