కోటరీ కోరినట్టే టెండర్లు! | Escalation clause in the creation of Capital Land Pooling Scheme infrastructure | Sakshi
Sakshi News home page

కోటరీ కోరినట్టే టెండర్లు!

Published Tue, Jan 22 2019 3:59 AM | Last Updated on Tue, Jan 22 2019 9:58 AM

Escalation clause in the creation of Capital Land Pooling Scheme infrastructure - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల టెండర్లకు ఓ విధానం అంటూ లేకుండా కోటరీ, బినామీ కాంట్రాక్టు సంస్థలు కోరినట్లుగా ప్రభుత్వ పెద్దలు కట్టబెడుతున్నారు. ఏ విధానంలో తమకు ఎక్కువ లాభదాయకమో అదే విధానాన్ని ఎంచుకుంటున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి సమీకరించిన భూముల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇప్పటికే రెండు విధానాల్లో టెండర్లను ఆహ్వానించిన పెద్దలు కోటరీ సంస్థలు ఎంపిక కాకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. కోటరీ, బినామీ సంస్థలు కోరిన విధానంలో లంప్సమ్‌ పర్సెంటేజ్‌ విధానంలో టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఎస్కలేషన్‌ క్లాజు విధించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించిన  టెండర్లలో ఎస్కలేషన్‌ క్లాజు విధించరు. ఈపీసీ విధానంలో కూడా ఎస్కలేషన్‌ క్లాజు ఉండదు. అయితే లంప్సమ్‌ విధానంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీములో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో సీఆర్‌డీఏ ఎస్కలేషన్‌ క్లాజును విధించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. 

అదనపు పని... అదనంగా బిల్లులు
ల్యాండ్‌ పూలింగ్‌ స్కీములోని ఐదు జోన్లలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం లంప్సమ్‌ పర్సంటేజ్‌ విధానంలో సీఆర్‌డీఏ టెండర్లను  ఆహ్వానించింది. లంప్సమ్‌ పర్సంటేజ్‌ విధానం అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత మేర అదనంగా నిధులను చెల్లించడం. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అదనంగా పనులను చేపడితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోటరీ కాంట్రాక్టర్లకు భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించి కమీషన్లు కాజేసేందుకే ఎస్కలేషన్‌ క్లాజు తెరపైకి తెచ్చారనే విషయం స్పష్టం అవుతోందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీముల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.5,784.20 కోట్ల విలువైన పనులకు లంప్సమ్‌ పర్సంటేజ్‌ విధానంలో సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈనెల 22వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాంకేతిక బిడ్‌ తెరుస్తారు. ఆర్థిక బిడ్‌ ఈ నెల 28వ తేదీన తెరుస్తారు. 

హైబ్రీడ్‌ యాన్యుటీ అంటే...
హైబ్రీడ్‌ యాన్యుటీ విధానం కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సొమ్మును నిర్మాణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 60 శాతం వ్యయం ప్రైవేట్‌ డెవలపర్‌ భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం సొమ్ము చెల్లించేందుకు అంగీకరించింది. 51 శాతం డెవలపర్‌ భరిస్తాడని పేర్కొంది. ఇది హైబ్రీడ్‌ యాన్యుటీ విధానానికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రైవేట్‌ డెవలపర్‌ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు ఏటా రెండు వాయిదాల్లో చెల్లించాలి. అప్పటివరకు ఉన్న వడ్డీకి అదనంగా మూడు శాతం కలిపి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంది. అయితే తదుపరి ప్రభుత్వం ఈ టెండర్లను రద్దుచేస్తే తమ పరిస్థితి ఏమిటని కోటరీ సంస్థలు ప్రశ్నించడంతో సీఆర్‌డీఏ ఆ టెండర్లను రద్దు చేసింది.

కోటరీ కోరికపై ఈపీసీ రద్దు!
ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించినా కోటరీ సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందులో ఎస్కలేషన్‌ క్లాజు ఉండదు. అంతేకాకుండా టెండర్లలో పేర్కొన్న అంతర్గత అంచనా వ్యయంపై ఐదు శాతం కన్నా ఎక్కువగా కోట్‌ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోటరీ సంస్థలు మనసు మార్చుకుని ఈపీసీ విధానంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరాయి. దీంతో సీఆర్‌డీఏ వీటిని రద్దు చేసి కోటరీ కోరిక మేరకు మూడోసారి లంప్సమ్‌ పర్సంటేజ్‌ విధానంలో ఎస్కలేషన్‌ క్లాజుతో టెండర్లను ఆహ్వానించింది.  

ఐదేళ్ల పాటు నిర్వహణ...
- జోన్‌–4 కింద పిచ్చుకలంక, తుళ్లూరు, అనంతవరంలోని 843.66 ఎకరాల పరిధిలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీములో రహదారులు, వంతెనలు, డ్రైన్స్‌ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.563.16 కోట్లతో లంప్సమ్‌ పర్సంటేజ్‌ విధానంలో సీఆర్‌డీఏ టెండర్లను  ఆహ్వానించింది. రెండేళ్లలో మౌలిక వసతులను కల్పించి ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.
జోన్‌–12 కింద కురగల్లు, నవులూరు, నిడమానూరులో 2,748.68 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,600.15 కోట్లతో టెండర్లను పిలిచారు.
​​​​​​​- జోన్‌–12 ఏ కింద కురగల్లు, నిడమానూరులో 2,155.79 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,154.35 కోట్లతో టెండర్లను సీఆర్‌డీఏ ఆహ్వానించింది. 
​​​​​​​- జోన్‌ 9, 9 ఏ కింద ఐనవోలు, నేలపాడు, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం పరిధిలోని 1,811.39 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.2,466.54 కోట్లతో టెండర్లను సీఆర్‌డీఏ ఆహ్వానించింది. 

కొత్త సర్కారు వస్తే?
రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలుత హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో అక్రమాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం, పలువురు విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదులు చేయడంతో కోటరీ సంస్థలు ఈ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగు వేశాయి. హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో లొసుగులు, లోపాలను తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం తప్పుబట్టి దర్యాప్తునకు ఆదేశిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి. దీనికి సీఆర్‌డీఏ, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement