ఉద్యానవనశాఖలో వేళ్లూనుకున్న అవినీతి
బినామీ కాంట్రాక్టర్‌లతో అధికారుల ఇష్టారాజ్యం
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ఉద్యానవన శాఖ పనుల్లో అవి నీతి చిగుళ్లు తొడుగుతోంది. బినామీ కాంట్రాక్టర్ల పేరిట అధికారులే ఎడాపెడా పనులు దక్కించుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఇతర కాంట్రాక్టులెవరికీ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా పనులు చేజి క్కించుకుంటున్నారు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేస్తున్నారంటే అదీ లేదు. తూతూ మంత్రంగా పనులు చేసేసి బిల్లులు డ్రా చేసుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న తీరు ఇలా ఉంది...!
లాసన్స్ బే కాలనీలో బీచ్ వద్ద పార్కు అభివృద్ధికి రూ. 80.39 లక్షల విలువతో గత ఏడాది టెండర్లు పిలిచారు. ఇందులో ప్రధానమైనవి రూ. 49 లక్షలతో చేపట్టాల్సిన పార్కు పనులు. ఇందులో పచ్చిక తివాచీ(లాన్), పూల మొక్కలు, కొరియన్ కార్పెట్‌తో కూడిన ల్యాండ్ స్కేపింగ్ పనులు. కాగా ఈ టెండర్‌ను కూడా బినామీ పేరుతో అధికారులు చేజిక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ. 49 లక్షల పార్కు పనులకు టెండర్లు పిలిస్తే పలువురు పోటీపడే అవకాశం ఉంటుంది. అందుకే మరికొన్ని సివిల్ పనులను కూడా కలిపి అంచనా వ్యయాన్ని రూ. 80.39 లక్షలకు పెంచేశారు. ఆ పనులు దక్కించుకునేందుకు తమకు సన్నిహితుడైన పి.శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్‌ను రంగంలోకి తెచ్చారు. వాస్తవానికి ఆయనకు ల్యాండ్ స్కేపింగ్ పనుల్లో తప్ప మిగిలిన పనుల్లో ఎలాంటి అనుభవం లేదు. కానీ ఆయనకు అర్హత క ల్పించేందుకు కేవలం రెండు మాసాల వ్యవధిలో తొమ్మిది పనులు చేసినట్టుగా రికార్డులు జత చేశారు. ఒకే కాంట్రాక్టర్ రెండు నెలల్లో తొమ్మిది పనులు పూర్తి చేయడం అసాధ్యం. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనకు రూ. 80.39 లక్షల పనుల టెండర్‌ను ఖరా రు చేసేశారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కొన్నాళ్లు ఫైల్‌ను తొక్కిపెట్టారు. తర్వాత చడీచప్పుడు కాకుండా ఆ పనులను పి. శ్రీనివాస్‌కే క ట్టబెట్టారు.
ముందుకు సాగని పనులు
కాంట్రాక్టు దక్కించుకోవడం మీద చూపించిన శ్రద్ధ... పనులు పూర్తి చేయడం మీద మాత్రం అధికారులకు లేకుండా పోయింది. దాదాపు ఏడాది కావస్తున్నా లాసన్స్ బే కాలనీ బీచ్ పార్కు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇంత వర కూ కేవలం ఎర్రమట్టిని వేసి చేతులు దులుపుకున్నారు. పచ్చిక తివాచీ, పూలమొక్కలు, కొరియన్ కార్పెట్‌తో ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు ఊసే లేకుండా పోయింది.
ఇవి కూడా..!: జీవీఎంసీ ఉద్యానవన శాఖలో ఆది నుంచీ ఇదే రీతిలో అవినీతిపర్వం కొనసాగుతోంది. అధికారులకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయకుండా బిల్లులు చెల్లించేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలివిగో..!
15వ వార్డు నుంచి 22వ వార్డు వరకూ రూ. 3.4 లక్షలతో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అసలు జరగనే లేదు. 32వ వార్డు చాకలిపేట హిందూ శ్మశానం పక్కన పార్కు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఆ ఫైలును మాయం చేశారు. తమ సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు మళ్లీ పనులు అప్పగించి బిల్లులు డ్రా చేసుకున్నారు. జీవీఎంసీ నర్సరీలో గత నాలుగేళ్లలో మొక్కల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు రూ. 25లక్షలు విలువైన మొక్కలు జాడ లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
ఉద్యానవన శాఖలో ఓ అధికారి తన సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు 2012-13, 2013-14లో ఏకంగా రూ. 80 లక్షల వి లువైన పనులను ఏక పక్షంగా కట్టబెట్టా రు. ఇంత అవినీతి జరుగుతున్నా ఉద్యానవన శాఖను సంస్కరణకు జీవీఎంసీ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది.
పచ్చపాతం!
Published Thu, Mar 12 2015 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement