మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు, స్ప్రేయర్లను పంపిణీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవన్‌లో మంగళవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని చెప్పారు.
జూలైలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టాలపై సత్వరమే నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా, ఏ దశలోనూ డీఏపీ సహా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే 90 లక్షల ఎకరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలన్నారు.
డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా–ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పగడ్బందీగా, పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి మూడు ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్‌ల ఏర్పాటుకు ఈ నెలాఖరులోపు రైతు గ్రూపులను గుర్తించాలని చెప్పారు. ఉద్యాన రైతులకు పంటల మార్పిడిని అలవాటు చేయాలని సూచించారు.
మిర్చిలో తామర పురుగు, అరటిలో సిగటోక తెగులు, పత్తిలో తెల్లదోమ వంటి తెగుళ్ల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొం డయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment