ప్రొద్దుటూరు టౌన్ : నాడు పేదల ఓట్ల కోసం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజలను అప్పుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే 36గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ పద్ధతిలో నాసికరంగా ఇళ్లు నిర్మిస్తున్నారని వివరించారు.
లబ్ధి దారులను నుంచి తక్షణమే ఒకరకం ఇంటికి రూ.50 వేలు, మరో రకం ఇంటికి రూ.లక్ష డిపాజిట్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.3 లక్షలకు లబ్ధిదారుని వాటా కలిపితే రూ.4లక్షలు అవుతుందన్నారు. చదరపు అడుగుకు రూ.1,000 నుంచి రూ.1,200 ఖర్చుచేస్తే రూ.3.50 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. కానీ ప్రభుత్వం తన బినామీ కాంట్రాక్టర్‌కు చదరపు అడుగుకు రూ.2,140 ఇస్తోందని, ఈ విధంగా ప్రతి లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు దండుకుంటున్నారన్నారు. ఈ విధంగా ఒక్క ప్రొద్దుటూరులోని 4 వేల ఇళ్ల నిర్మాణంలో రూ.120 కోట్ల పేదల సొమ్ము లోకేశ్‌బాబు చెంతకు చేరుతోందన్నారు.
పేదలను అప్పులపాలు చేసేందుకే..
ఒక్కో లబ్ధిదారునికి బ్యాంకుల నుంచి రూ.లక్షలు అప్పు ఇప్పించి 70 పైసల వడ్డీతో ప్రతినెల రూ.4వేల నుంచి రూ.5వేలు బ్యాంకుకు చెల్లించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈవిధంగా చివరకు రూ.17లక్షల నుంచి రూ.18 లక్షలు పేదోడిపై భారం పడుతోందని తెలిపారు. ఇదేనా పేదల సొంతింటి కల నిజం చేసే విధానం అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ అక్క చెల్లెమ్మలకు చెప్పకుండా అబద్ధాలు చెప్పి అప్పులఊబిలో నెడుతున్నారని తెలిపా రు. బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే నోటీసులు జారీ చేసి ఇంటిని జప్తు చేసి వారిని కోర్టుల చుట్టూ తిప్పుతారని పేర్కొన్నారు. తాను చేసిన ఈ ప్రకటనలో ఒక్క అక్షరం తప్పని చెప్పి టీడీపీకి వలస వచ్చిన మంత్రులు నిరూపిస్తే దీక్షను విరమిస్తానని అన్నారు. లేదంటే ఇదే అక్క చెల్లెమ్మలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల బలంతో ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు 2019లో వైఎస్సార్‌సీపీకి అధికారం కల్పించిన పిమ్మట జగన్ ప్రభుత్వంలో 2సెంట్ల స్థలంలో స్వతంత్ర ఇంటిని నిర్మించి ఆడబిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పేదల పట్ల పెద్ద హృదయంతో మెలగాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతాం
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ప్రజలు అండగా నిలవాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్ని నియోజకవర్గాల్లో దూసుకెళుతుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చే విధంగా పోరాడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment