సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో బుధవారం వారు సమావేశమయ్యారు. విద్యుత్ సంస్థల్లో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గత నెల 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ 24 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అందులోని అంశాలను జేఏసీ నేతలు మరోసారి బాలినేని, సజ్జల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనిపై బాలినేని, సజ్జల స్పందిస్తూ ఉద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.
దశలవారీగా పరిష్కారం...
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ బాధ్యతలను తమ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే కేటాయించాలని కోరగా సమీక్షించి ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తామని బాలినేని, సజ్జల తెలిపారు. జేఏసీ విజ్ఞప్తి మేరకు సర్వీస్ రెగ్యులేషన్స్‌ను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఏపీజెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, జేఏసీ యూనియన్ల నాయకులు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికృష్ణ చర్చల్లో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నేతలు బాలినేని, సజ్జల, ఇంధన శాఖ కార్యదర్శి, డిస్కంల సీఎండీలతో ప్రత్యేకంగా సమావేశమై ఇవే అంశాలపై చర్చించారు. అన్నింటిపై ప్రభుత్వం నుంచి సానుకూల హామీ లభించిందని వెల్లడించారు.
విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత వైద్యం
Published Thu, Feb 17 2022 4:47 AM | Last Updated on Thu, Feb 17 2022 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment