ఆప్షన్‌ ఇచ్చుకున్న చోటే..! | Supreme Court On Electricity Employees Options | Sakshi
Sakshi News home page

ఆప్షన్‌ ఇచ్చుకున్న చోటే..!

Published Thu, Apr 18 2019 1:23 AM | Last Updated on Thu, Apr 18 2019 1:23 AM

Supreme Court On Electricity Employees Options - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేటాయింపులు జరపాల్సిన విద్యుత్‌ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు వారిచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వారి సొంత జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో ఆ రాష్ట్రానికే సర్దుబాటు చేయాలి. సొంత జిల్లాలను ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వారి నుంచి సేకరించిన, రాతపూర్వకంగా వారు సమర్పించిన అభ్యర్థనల్లో ఉన్న సమాచారం ఆధారంగా గుర్తించాలి’అని జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడిన విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. ఈ కమిటీ జారీ చేసే ఆదేశాలే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ధర్మాధికారి కమిటీ, విద్యుత్‌ ఉద్యోగుల విభజన కోసం కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఉద్యోగుల ఆప్షన్లకే పెద్ద పీట వేయడంతో, కోరుకున్న రాష్ట్రానికే వారి కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి. ఏపీ స్థానికత గల 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఏపీకి రిలీవ్‌ చేస్తూ 2015 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కమిటీ తాజా ప్రతిపాదనలతో తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చుకున్న 600 మందికి పైగా ఉద్యోగులు మళ్లీ తెలంగాణకే రానున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో బుధవారం ఇక్కడ సమావేశమైన జస్టిస్‌ ధర్మాధికరి.. మే 25 లోగా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ఇంకా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగుల నుంచి మళ్లీ ఆన్‌లైన్‌లో ఆప్షన్లు స్వీకరించాలని కమిటీ సూచించింది. 

ఇవీ కమిటీ మార్గదర్శకాలు.. 
- ఉమ్మడి ఏపీ విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల్లో కేటాయింపులు చేయదగిన ఉద్యోగులందరినీ ఏపీ, తెలంగాణకు జరిపే తుది కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏకపక్షంగా రిలీవ్‌ అయిన 1157 మందితో పాటు, తెలంగాణలో ఏకపక్షంగా జాయిన్‌ అయిన 514 మంది ఉద్యోగులు సైతం పరిగణనలోకి వస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి కేటాయింపులు జరపాలి. 
- విద్యుత్‌ సంస్థల వారీగా, ఒక్కో విద్యుత్‌ సంస్థకు మంజూరైన పోస్టుల నిష్పత్తి ప్రకారం రెండు కొత్త రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులు జరపాలి. విభజన చట్టం ప్రకారం ఇంధన శాఖ డిస్కంల కోసం జారీ చేసిన జీవోలకు అనుగుణంగా కేటాయింపులుండాలి.  
- ఉద్యోగుల కేటాయింపు జాబితా తయారైన తర్వాత దాన్ని సదరు విద్యుత్‌ సంస్థ ప్రధాన కార్యాలయం నోటీసు బోర్డు మీద అతికించాలి. సంస్థ వెబ్‌సైట్‌తో పాటు ఉద్యోగుల సమాచార వెబ్‌సైట్లలో ఉంచాలి. ప్రతిపాదిత కేటాయింపుల నోటీసుకు మూడు వారాల్లోగా సంబంధిత ఉద్యోగులు తమ రాత పూర్వక అభ్యర్థనలను సమర్పించవచ్చు.  
- ఏపీ, తెలంగాణ విద్యుత్‌ సంస్థల అధికారులతో ఓ ద్విసభ్య ఉప కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతిపాదిత కేటాయింపులపై ఉద్యోగులు పెట్టుకునే అభ్యర్థులను ఈ ఉపకమిటీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి కేటాయింపుల జాబితాను ప్రతిపాదించాలి.  
- ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందిన రాష్ట్రంలోని సరైన విద్యుత్‌ సంస్థకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కేటాయించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించాలి. 
- తీవ్రమైన వ్యక్తిగత సమస్యలు గల ఉద్యోగులకు మినహాయింపులు ఉంటాయి.  
- వితంతువులు, చట్టపరంగా వేరుపడిన, విడాకులు పొందిన మహిళా ఉద్యోగులను వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. 
- రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం 60 శాతానికి పైగా వైకల్యం గల ఉద్యోగులను ఆప్షన్‌ ఆధారంగా కేటాయించాలి.  
- ఉద్యోగి జీవిత భాగస్వామి లేదా సంతానం కేన్సర్, ఓపెన్‌ çహార్ట్‌/బైపాస్‌ సర్జరీ, కిడ్నీ మార్పిడి/కిడ్నీ వైఫల్యంతో డయాలసిస్, మానసిక వైకల్యం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటే, సదరు ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వారి కేటాయింపులు జరపాలి. 
ఎ) ఉద్యోగి జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తుంటే ఈ కింది మార్గదర్శకాలను అనుసరించాలి.  
బి) ఇద్దరు జీవిత భాగస్వాములను వారి సొంత రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరపొచ్చు. 
సి) జీవిత భాగస్వామి ఒకరు విద్యుత్‌ సంస్థల్లో, మరొకరు పీఎస్‌యూ/రక్షణ సంస్థలు/రైల్వేలు/బ్యాంకింగ్, బీమా రంగం/కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే, ఇలాంటి సమయంలో ఒక్కో కేసు ఆధారంగా కేటాయింపులు జరపాలి.  
డి) జీవిత భాగస్వాములిద్దరూ వేర్వేరు రాష్ట్రాల(ఏపీ/టీఎస్‌)కు చెందిన వారైతే, వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి.  
- ఇప్పటికే పదవి విరమణ చేసిన/చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లను పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు జరపాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement