
సమ్మె విరమించిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు
హైదరాబాద్ : సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం హామీ మేరకు....తుపాను, పండుగల సందర్భంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.
రేపు ఉదయం ఆరు గంటల నుంచి విధులకు హాజరు అవుతున్నట్లు విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమ్మె విరమించలేదని... తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే సమ్మెను వాయిదా వేసినట్లు తెలిపారు. తమ ఉద్యమంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చిందని భావిస్తున్నామన్నారు. మూడు విడతలుగా సీఎంతో చర్చలు జరిపినట్లు విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అవసరం అయితే మళ్లీ ఉద్యమిస్తామన్నారు.