ముఖ్యమంత్రిపై ఉద్యోగ సంఘాల నేతల అసహనం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విద్యుత్ జేఏసీ నేతలు ఆగ్రహంతోపాటు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సమ్మెపై చర్చించడానికి గురువారం ఉదయం 11 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో చర్చలకు విద్యుత్ ఉద్యోగులను పిలిచారు. అయితే చివరి నిమిషంలో సమావేశాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి మార్చారు.
వేదిక మార్పు సమాచారం అందుకున్న విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయానికి చేరుకున్నారు. అయితే నిర్ధిష్ట సమయానికి సమావేశం ఆరంభం కాకపోగా.. ఉద్యోగ సంఘాల నేతలకు ఎలాంటి సమాచారం అందించలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కోసం సచివాలయంలో గంటన్నర నుంచి విద్యుత్ సంఘాల నేతలు వేచి ఉన్నారు. సమావేశంపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.