Seemandhra Electricity employees
-
సమ్మె విరమించిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు
-
సమ్మె విరమించిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు
హైదరాబాద్ : సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం హామీ మేరకు....తుపాను, పండుగల సందర్భంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి విధులకు హాజరు అవుతున్నట్లు విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమ్మె విరమించలేదని... తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే సమ్మెను వాయిదా వేసినట్లు తెలిపారు. తమ ఉద్యమంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చిందని భావిస్తున్నామన్నారు. మూడు విడతలుగా సీఎంతో చర్చలు జరిపినట్లు విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అవసరం అయితే మళ్లీ ఉద్యమిస్తామన్నారు. -
అంధకారంలో ఆంధ్రప్రదేశ్
-
ఉద్యోగుల మెరుపు సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం!
-
ఉద్యోగుల మెరుపు సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం!
రాష్ట్ర విభజనకు నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టడంతో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యుత్ సిబ్బంది మెరుపు సమ్మెతో ఉత్పత్తి సగానికిపైగా నిలిచిపోయింది. సుమారు 7వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తాజా సమాచారం. విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో నిలిచిపోవడంతో హైదరాబాద్కు వేయిమెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సంక్షోభ ప్రభావంతో మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కోతలు ప్రారంభకానుంది. రైల్వేలకు అవసరమైన 1500 మెగావాట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ సమస్య ఆదివారం సాయంత్రానికి మరింత విషమంగా మారితే పరిస్థితులు అధ్వాన్నంగా మారుతాయని, రైళ్లను నడపడం తమ వల్లకాదు అని రైల్వే అధికారులు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో దారుణంగా విద్యుత్ కోతలు ఇప్పటికే విధించారు. అనేక ప్రాంతాలకు కరెంట్ ను నిలిపివేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్య ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. తమిళనాడు, కర్ణాటకల్లో విద్యుత్ కొరత నెలకొంది. గ్రిడ్ విఫలమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రైల్వే గ్రిడ్ ఫెయిలైతే పునరుద్ధరణకు 5రోజులు సమయం పడుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. 30 వేల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాలుపంచుకుంటున్నారని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ సంక్షోభంతో విజయవాడ, రేణిగుంట మధ్య పలు పాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. అంతేకాకుండా విజయవాడ-ఒంగోలు, గూడురు-ఒంగోలు, తెనాలి-గూడూరు, తిరుపతి-గూడూరు స్టేషన్ల మధ్య రైళ్లను రద్దు చేశారు. వ్యవసాయ, ఆస్పత్రులకు, నీటి సరఫరా లాంటి అత్యవసర సేవలకు కూడా మినహాయింపులేదు అని జేఏసీ చైర్మన్ సాయిబాబా తెలిపారు. విభజనపై నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సమ్మె విరమించేది లేదు అని హెచ్చరించారు. -
'జేసీ, కేశినేని బస్సులు ఎందుకు ఆగటం లేదు'
హైదరాబాద్ : సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సమ్మె వల్ల తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కోతల పెడితే ఊరుకునేది లేదని ఆయన గురువారమిక్కడ హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులు ఆగినా జేసీ, కేశినేని బస్సులు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. బంద్ నుంచి చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలకు ఎందుకు మినహాయించారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి 72 గంటల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
తెలుగోడి హృదయం-హైదరబాద్ నగరం
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కొనసాగుతోంది. తెలుగోడి హృదయం-హైదరబాద్ నగరం...అంటూ విశాఖలోని విద్యుత్ ఉద్యోగులు నినదిస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగారు. విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటుపై శాసనసభలో చర్చకు, పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటే మాత్రం సేవలను పూర్తిగా నిలిపివేసి మళ్లీ సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఈపీడీసీఎల్, ఎస్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో 190 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నిరవధిక సమ్మె చేయాలనుకున్నప్పటికీ ప్రభుత్వంతో చర్చల తర్వాత అది 72 గంటలకు మారింది. సమ్మె కుదింపు వల్ల ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాకూడదని ఉద్యోగులు నిర్ణయించారు. అత్యవసర సమయాల్లోనూ ఇది వర్తిస్తుందని ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు. -
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు పిలుపు
-
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మె
హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వారు జరిపిన చర్చల ఫలితంగా నిరవధిక సమ్మెను వాయిదావేసుకున్నారు. 72 గంటలు మాత్రమే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో చర్చలు ముగిసిన అనంతరం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరవధిక సమ్మెను విరమించమని సిఎం కోరినట్లు తెలిపారు. తాము కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి నిరవధిక సమ్మెను విరమించుకున్నట్లు తెలిపారు. 72 గంటల సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సమ్మె నుంచి అత్యవసర సర్వీసులు మినహాయించినట్లు కూడా వారు తెలిపారు. తమ కోరిక సమైక్యాంధ్ర ప్రదేశ్ అని తెలిపారు. తెలంగాణ జిల్లాలలో కూడా సమైక్యాంధ్ర కోరుకునేవారు ఉన్నట్లు చెప్పారు. అయితే వారు భయపడి బయటకు రాలేకపోతున్నారన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
-
నేటి అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సమైక్యాంధ్ర సమ్మె రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. రోజుకో కొత్త వర్గం ఈ సమ్మెలో భాగస్వామ్యం వహిస్తోంది. తాజాగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు సీమాంధ్ర ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు సమ్మె నోటీసు అందించారు. మరోవైపు ఉద్యోగుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. అధికారులందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు, కళాశాలలు తెరవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.