
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మె
హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వారు జరిపిన చర్చల ఫలితంగా నిరవధిక సమ్మెను వాయిదావేసుకున్నారు. 72 గంటలు మాత్రమే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు.
క్యాంపు కార్యాలయంలో సీఎంతో చర్చలు ముగిసిన అనంతరం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరవధిక సమ్మెను విరమించమని సిఎం కోరినట్లు తెలిపారు. తాము కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి నిరవధిక సమ్మెను విరమించుకున్నట్లు తెలిపారు. 72 గంటల సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సమ్మె నుంచి అత్యవసర సర్వీసులు మినహాయించినట్లు కూడా వారు తెలిపారు.
తమ కోరిక సమైక్యాంధ్ర ప్రదేశ్ అని తెలిపారు. తెలంగాణ జిల్లాలలో కూడా సమైక్యాంధ్ర కోరుకునేవారు ఉన్నట్లు చెప్పారు. అయితే వారు భయపడి బయటకు రాలేకపోతున్నారన్నారు.