ఉద్యోగుల మెరుపు సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం!
Published Sun, Oct 6 2013 2:09 PM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM
రాష్ట్ర విభజనకు నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టడంతో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యుత్ సిబ్బంది మెరుపు సమ్మెతో ఉత్పత్తి సగానికిపైగా నిలిచిపోయింది. సుమారు 7వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తాజా సమాచారం. విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో నిలిచిపోవడంతో హైదరాబాద్‌కు వేయిమెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.
విద్యుత్ సంక్షోభ ప్రభావంతో మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కోతలు ప్రారంభకానుంది. రైల్వేలకు అవసరమైన 1500 మెగావాట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ సమస్య ఆదివారం సాయంత్రానికి మరింత విషమంగా మారితే పరిస్థితులు అధ్వాన్నంగా మారుతాయని, రైళ్లను నడపడం తమ వల్లకాదు అని రైల్వే అధికారులు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది.
సీమాంధ్ర జిల్లాల్లో దారుణంగా విద్యుత్ కోతలు ఇప్పటికే విధించారు. అనేక ప్రాంతాలకు కరెంట్ ను నిలిపివేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్య ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. తమిళనాడు, కర్ణాటకల్లో విద్యుత్ కొరత నెలకొంది. గ్రిడ్ విఫలమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రైల్వే గ్రిడ్ ఫెయిలైతే పునరుద్ధరణకు 5రోజులు సమయం పడుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.
30 వేల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాలుపంచుకుంటున్నారని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ సంక్షోభంతో విజయవాడ, రేణిగుంట మధ్య పలు పాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. అంతేకాకుండా విజయవాడ-ఒంగోలు, గూడురు-ఒంగోలు, తెనాలి-గూడూరు, తిరుపతి-గూడూరు స్టేషన్ల మధ్య రైళ్లను రద్దు చేశారు. వ్యవసాయ, ఆస్పత్రులకు, నీటి సరఫరా లాంటి అత్యవసర సేవలకు కూడా మినహాయింపులేదు అని జేఏసీ చైర్మన్ సాయిబాబా తెలిపారు. విభజనపై నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సమ్మె విరమించేది లేదు అని హెచ్చరించారు.
Advertisement
Advertisement