రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కొనసాగుతోంది.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కొనసాగుతోంది. తెలుగోడి హృదయం-హైదరబాద్ నగరం...అంటూ విశాఖలోని విద్యుత్ ఉద్యోగులు నినదిస్తున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగారు. విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటుపై శాసనసభలో చర్చకు, పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటే మాత్రం సేవలను పూర్తిగా నిలిపివేసి మళ్లీ సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు.
ఈపీడీసీఎల్, ఎస్, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో 190 మంది
ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నిరవధిక సమ్మె చేయాలనుకున్నప్పటికీ ప్రభుత్వంతో చర్చల తర్వాత అది 72 గంటలకు మారింది. సమ్మె కుదింపు వల్ల ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాకూడదని ఉద్యోగులు నిర్ణయించారు. అత్యవసర సమయాల్లోనూ ఇది వర్తిస్తుందని ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు.