విద్యుత్ ధర్నాలో ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని టీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాధ్యతతో వీలైనంత త్వరగా రిలీవ్ అయిన 1,253 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలన్నారు.హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ ఎంపీలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీ విభజన సమయంలో రాష్ట్రాలనే భేదం లేకుండా అందరికి న్యాయం చేస్తానని చెప్పిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఆ మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపకుండా పరస్పరం నిందారోపణలు చేసుకోడం దురదృష్టకరమన్నారు.
కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ, జేడీ శీలం, తోట నర్సింహం, రవీంద్రబాబు, కొత్తపల్లి గీత, రామ్మోహన్‌నాయుడు, మాగంటి బాబు, మాల్యాద్రి పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మోదీ పీఎస్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ప్రధానితో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
కేంద్రమే పరిష్కరించాలి
Published Sat, Aug 1 2015 2:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement