సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు 2021ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తే.. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరించింది. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్‌పీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈ ఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ, కో చైర్మన్ పి.అంజయ్య మాట్లాడుతూ... రైతులు, పేదలకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాదని బిల్లు తీసుకొస్తే.. ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సహా ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు, ఇంధనం, రవాణా తదితర రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. నష్టాల పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిం దని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment