Electricity Amendment Bill 2021
-
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
గల్లీకో కరెంట్ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణల అమల్లో కేంద్రం దూకుడు పెంచింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా గల్లీకో కరెంట్ పంపిణీ కంపెనీ (డిస్కం) ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత చిన్న ప్రాంతమైనా సరే.. విద్యుత్ సరఫరా కోసం ఉండాల్సిన కనీస ప్రాంతం (మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టింది. ఆ చిన్న ప్రాంతం పరిధిలో ఒకటి మించి విద్యుత్ పంపిణీ కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) లైసెన్స్ జారీ చేయడానికి వీలుకలగనుంది. ఈ మేరకు ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ సవరణ నిబంధనలు–2022’ను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా అమల్లోకి తెచ్చింది. ‘ఏదైనా చిన్న ప్రాంతం’ నిబంధనతో.. ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక మున్సిపల్ కార్పొరేషన్/ పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలు/ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినా ఏదైనా చిన్న ప్రాంతంలో ఒకటికి మించి డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసుకోవచ్చు. ఇందులో ‘ఏదైనా చిన్న ప్రాంతం’ అనే వెసులుబాటు కారణంగా కనీస ప్రాంతం విషయంలో పరిమితిని దాదాపుగా ఎత్తివేసినట్టు అయిందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. ‘విద్యుత్ బిల్లు’ అమల్లో భాగమే! ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. ఇక డిస్కంలకు విద్యుత్ పంపిణీ కోసం సొంత ట్రాన్స్మిషన్ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి) వ్యవస్థ ఉండాలన్న నిబంధననూ తొలగిస్తున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. తాజాగా కనీస ప్రాంత పరిధిపై పరిమితిని ఎత్తివేసింది. ఇది ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు’ను పరోక్షంగా అమల్లోకి తెచ్చినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు పూర్తిగా లైన్ క్లియర్! ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్)లు ఉన్నాయి. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. తమ ప్రాంతాల పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేసుకున్నాయి. కొత్త నిబంధనల కారణంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెరపైకి రానున్నాయి. బాగా లాభాలు వచ్చే పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం అవి పోటీపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే...
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చేసే విద్యుత్ చట్టసవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆర్కే సింగ్ తమ వైఖరిని మళ్లీ వెల్లడించారు. విద్యుత్తు సంస్కరణలపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్కే సింగ్, విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్నారని, అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఉన్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్తు చట్టసవరణ బిల్లు ఉపయోగపడు తుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడుతూ గత నెల లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు చట్టసవరణ బిల్లులో పొందుపరి చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కలి గించేవే అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా విద్యుత్ పంపిణీ విషయంలో పోటీతత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరల్లోనే మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. అంతేగాక విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను ఏరకంగానూ అడ్డుకోవడం లేదని ఆర్కే సింగ్ స్పష్టత ఇచ్చారు. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు కేవలం రైతులకు మాత్రమే కాకుండా, తాము ఇవ్వాలని భావించిన ఏ వర్గానికి అయినా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌తోపాటు సబ్సిడీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరంలేదని ఆర్కేసింగ్ వెల్లడించారు. ఇదీ చదవండి: విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి ముమ్మాటికీ కక్ష సాధింపే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఈ తంతు అర్ధమవుతుందన్నారు. సోమవారం శాసనమండలిలో ‘కేంద్ర విత్యుత్ బిల్లు–పర్యవసానాలు’పై జరిగిన లఘు చర్చలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన సంక్షేమ పథకాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్ ప్రజలు సైతం కితాబిస్తున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు ఉత్తర భారత ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓర్వలేక రాష్ట్రంపై విషం కక్కే చర్యలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండా స్వదేశీ బొగ్గును కాదని, విదేశీ బొగ్గు వినియోగించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ బొగ్గు మెట్రిక్ టన్ను రూ.3,800కు దొరుకుతుంటే, విదేశీ బొగ్గును రూ.35 వేలు వెచ్చించి కొనుగోలు చేయాలనడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్ నిర్వహణలో ఉత్పత్తి, విక్రయ కంపెనీలను కాకుండా కేంద్రం, రాష్ట్రం, ఆర్బీఐని భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేయడం కూడా అర్థరహితమని అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అన్ని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండాగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇదీ చదవండి: 20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్! -
20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మరోసారి శాసనసభ తీర్మానం చేసి పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు’పై మాట్లాడిన కేసీఆర్.. గతంలో భూ, రైతు చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, ఇప్పుడు దేశంలోని విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఇదే జరిగితే దేశంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని అన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాను చెబుతున్న లెక్కలు తప్పయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు. దగాపై దేశం మేల్కొని పోరాడాలి.. ‘జవహర్లాల్ నెహ్రూ కాలం నాటి నుంచి దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలు, డిస్కంలు, ట్రాన్స్‌కో,జెన్కోల ద్వారా సముపార్జించిన లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటు షావుకార్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్కరణల పేరిట దేశానికి చేస్తున్న దగా ఇది. దీనిపై దేశం మేల్కొని పోరాడాలి. ఇవి ప్రజల ఆస్తులు... ఎక్కడిదాకైనా కొట్లాడతం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రైతుబంధు’నిజమైన ఉద్దీపన ‘ఉమ్మడి రాష్ట్రంలో 20 ఎకరాలున్న రైతులు కూడా నగరానికి వచ్చి కూలీ పనులు చేశారు. ఆటోలు నడిపారు. జగద్గిరిగుట్టకు వలస వచ్చారు. నిన్నా ఇవాళ రైతుల మొఖం తెల్లబడుతోంది. 66 లక్షల మందికి ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన. అందుకే ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈఆర్సీ రుణాలు రాకుండా అడ్డుపడుతున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు ‘ఉదయ్’పథకంలో చేరితే ఇబ్బందులు పెడుతున్నారు. ఎఫ్ఆర్ఎంబీలో కోతలు పెడతామని అంటున్నారు. విశ్వగురు విశ్వరూపం భయంకరం. శ్రీలంకలో భారత ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు..’అని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి ‘కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లుల వల్ల రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల విద్యుత్ బిల్లులను వెనక్కు తీసుకోవాలి. ఇది పోరాటాల గడ్డ.. పౌరుషాల గడ్డ.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచేయవు. 20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి. లక్షల కోట్ల విద్యుత్ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం చేయాలి. విద్యుత్ బిల్లు వెనక్కు తీసుకోకపోతే , బాయిల కాడ మీటర్లు పెడితే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’అని సీఎం స్పష్టం చేశారు. తట్టుకోలేక కొత్త కుట్రలు.. ‘తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావలసిన రూ.17,828 కోట్లు కేంద్రం ఇప్పించకుండా, తెలంగాణ బకాయి ఉన్న రూ.3 వేల కోట్లకు ఎక్కడా లేని విధంగా 18 శాతం వడ్డీ చొప్పున మరో రూ.3 వేల కోట్లు కలిపి నెలరోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేసింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటారట. కేంద్రాన్ని రూపాయి అడగకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దానిని కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వానాకాలం సీజన్లోనే 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మొత్తం 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి. దీన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆనాడు సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నారు. ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారు..’అని కేసీఆర్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు!
సాక్షి, హైదరాబాద్: ‘కేవలం 36 శాతం ఓట్లు తెచ్చు కునే.. కేంద్రంలో రాజ్యమేలుతున్న బీజేపీ ప్రభుత్వం విపరీతంగా విర్రవీగుతోంది. బీజేపీ ప్రభుత్వ తీరుతో భారత మాత గుండెమీద గాయం అవుతోంది. అధికారం నెత్తికెక్కితే కాలమే కఠినంగా శిక్షిస్తది. అధికారం శాశ్వతం కాదు, మోదీ ప్రభుత్వానికి ఇంకా 18 నెలల సమయమే మిగిలింది. దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. బుద్ధుడు నడయాడిన, ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో ఇప్పుడేం జరుగుతోంది?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లు–పర్యవసానాలు’ అంశంపై సోమవారం ఉదయం శాసనసభలో జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క మంచి పనికూడా చేయలేని అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణించారు. సంస్కరణలకు అందమైన ముసుగు ‘నాణ్యమైన కరెంటు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, సంస్కరణలు అనే అందమైన ముసుగు వేసి షావుకార్లకు అడ్డంగా దోచిపెట్టే దోపిడీకి తెరదీసింది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మేసుకుంటూ, ఆర్టీసీ లాంటి సంస్థలను తీసేస్తే రూ.వేయి కోట్లు చొప్పున బహుమతి ఇస్తానని చెప్తున్న కేంద్రం.. వ్యవసాయ, విద్యుత్ రంగాలను కూడా షావుకార్ల చేతుల్లో పెట్టేవరకు నిద్రపోను అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పంట ఉత్పత్తులను ధర ఎక్కువగా ఉండే ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చంటూ వ్యవసాయ చట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించడంలోని లోగుట్టును గుర్తించలేమా? బాన్సువాడ రైతు పంటను పంజాబ్‌కు తీసుకెళ్లి అమ్ముకోగలడా? ఈ మహానుభావుల పుణ్యాన పెరిగిన డీజిల్ ధరలతో అది సాధ్యమా? ఎరువుల ధరలు, దున్నే ఖర్చులు, కోసే ఖర్చులు పెరిగి భరించలేక తట్టాపార కిందపెట్టాలి. అప్పుడు సూట్‌కేసులు పట్టుకుని షావుకార్లు దిగుతరు. మీ పొలాలను మాకు అప్పగించండి, మీరు మా దగ్గర కూలీలుగా పనిచేయండి అంటరు. ఇదే మోదీ ప్రభుత్వం అసలు లోగుట్టు. ఇలా షావుకార్లకు అప్పగించేందుకే ఈ సంస్కరణల భాగోతం’ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కరణలు అమల్లోకొస్తే ప్రీపెయిడ్ మీటర్లే.. ‘సమైక్య రాష్ట్రంలో సరైన కరెంటు దొరక్క అన్ని వర్గాలు ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే. సొంత రాష్ట్రం వచ్చాక పరిస్థితిని చక్కదిద్దుకుందామంటే ఆది నుంచి కేంద్రం కుట్రలు చేస్తూనే ఉంది. మోదీ తొలి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. తాజాగా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం విషయంలో, రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చట్ట సవరణ బిల్లులో కూడా అదే జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కరెంటు కనెక్షనే ఉండదన్న విషయాన్ని రాష్ట్రాల అభిప్రాయంతో ప్రమేయం లేకుండా పొందుపరిచింది. కేంద్ర విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు లేకుండా ఎలాంటి కరెంటు కనెక్షన్ అయినా ఇవ్వడానికి వీలు ఉండదు..‘ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదీ మోదీ ఘనత.. ‘తెలంగాణ ఆవిర్భవించిన 2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 970 యూనిట్లు కాగా, జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ తలసరి వినియోగం 2,126 యూనిట్లకు చేరితే, జాతీయ వినియోగం కేవలం 1,255 యూనిట్లకు మాత్రమే చేరింది. ఇవి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు. ఇక ఇంటర్నేషనల్ అథారిటీ లెక్కలు పరిశీలిస్తే, ఐస్‌ల్యాండ్ తలసరి వినియోగం 51,696 యూనిట్లు, యూఎస్ 12,154, జపాన్ 7,150, చైనా 6,312, భూటాన్ వినియోగం 3,126 యూనిట్లుగా ఉంది. 140 దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు 104. ఇది విశ్వగురువు ఘనత..’ అని ఎద్దేవా చేశారు. చేష్టలుడిగిన సర్కార్.. ‘ఒక చిన్న సర్దుబాటుతో బిహార్ దుఖదాయినులుగా ముద్రపడ్డ కోసి, గండకి నదులపై విద్యుదుత్పత్తి ప్రారంభిస్తే ఇటు కరెంటు అందుబాటులోకి వస్తుంది. అటు వరదల బాధా తప్పుతుంది. అలాంటి సలహా ఇచ్చినా చేయలేని అసమర్ధ ప్రభుత్వం మోదీది. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయగలిగే 2,42,890 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించలేని దుస్థితి నెలకొంది. ఇది కాకుండా వనరుల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వేరియబుల్ పవర్ మరో 1.60 లక్షల మెగావాట్ల మేర ఉంది. చివరకు చెత్తనుంచి కూడా విరివిగా కరెంటును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నా మోదీ ప్రభుత్వం చేష్టలుడిగిపోయింది’ అని కేసీఆర్ విమర్శించారు. ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం -
బిల్లు తెస్తే.. సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు 2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తే.. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరించింది. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈ ఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎస్పీఈజేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ, కో చైర్మన్ పి.అంజయ్య మాట్లాడుతూ... రైతులు, పేదలకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాదని బిల్లు తీసుకొస్తే.. ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహా ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు, ఇంధనం, రవాణా తదితర రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. నష్టాల పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిం దని వివరించారు. -
విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సవరణ చట్టం–2021ను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల జాతీయ కో–ఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్ ప్రశాంత్‌చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రశాంత్‌చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదించలేదన్నారు. అయితే ఫైనాన్స్ అడ్వైజరీ, ఫిక్కీ తదితర సంస్థ ప్రతినిధులు వంటి పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విద్యుత్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఇప్పుడున్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అదే జరిగితే.. వినియోగదారులపై రూ.4 వేల అదనపు భారంతో పాటు, రీచార్జ్ చేయకుంటే వెంటనే విద్యుత్ ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.