![Central Government Implements New Electricity Distribution License Rules 2022 In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/22/Untitled-7.jpg.webp?itok=FONI1_Ta)
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణల అమల్లో కేంద్రం దూకుడు పెంచింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా గల్లీకో కరెంట్ పంపిణీ కంపెనీ (డిస్కం) ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత చిన్న ప్రాంతమైనా సరే.. విద్యుత్ సరఫరా కోసం ఉండాల్సిన కనీస ప్రాంతం (మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టింది. ఆ చిన్న ప్రాంతం పరిధిలో ఒకటి మించి విద్యుత్ పంపిణీ కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) లైసెన్స్ జారీ చేయడానికి వీలుకలగనుంది. ఈ మేరకు ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ సవరణ నిబంధనలు–2022’ను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా అమల్లోకి తెచ్చింది.
‘ఏదైనా చిన్న ప్రాంతం’ నిబంధనతో..
ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక మున్సిపల్ కార్పొరేషన్/ పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలు/ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినా ఏదైనా చిన్న ప్రాంతంలో ఒకటికి మించి డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసుకోవచ్చు. ఇందులో ‘ఏదైనా చిన్న ప్రాంతం’ అనే వెసులుబాటు కారణంగా కనీస ప్రాంతం విషయంలో పరిమితిని దాదాపుగా ఎత్తివేసినట్టు అయిందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు.
‘విద్యుత్ బిల్లు’ అమల్లో భాగమే!
ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. ఇక డిస్కంలకు విద్యుత్ పంపిణీ కోసం సొంత ట్రాన్స్‌మిషన్ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి) వ్యవస్థ ఉండాలన్న నిబంధననూ తొలగిస్తున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. తాజాగా కనీస ప్రాంత పరిధిపై పరిమితిని ఎత్తివేసింది. ఇది ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు’ను పరోక్షంగా అమల్లోకి తెచ్చినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రైవేటుకు పూర్తిగా లైన్ క్లియర్!
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్/టీఎస్‌ఎస్పీడీసీఎల్)లు ఉన్నాయి. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. తమ ప్రాంతాల పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేసుకున్నాయి. కొత్త నిబంధనల కారణంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెరపైకి రానున్నాయి. బాగా లాభాలు వచ్చే పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం అవి పోటీపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment