ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! | KCR Lashes Out At Modi In Assembly Over Electricity Amendment Bill | Sakshi
Sakshi News home page

18 నెలల సమయమే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు!

Published Tue, Sep 13 2022 1:43 AM | Last Updated on Tue, Sep 13 2022 3:09 AM

KCR Lashes Out At Modi In Assembly Over Electricity Amendment Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేవలం 36 శాతం ఓట్లు తెచ్చు కునే.. కేంద్రంలో రాజ్యమేలుతున్న బీజేపీ ప్రభుత్వం విపరీతంగా విర్రవీగుతోంది. బీజేపీ ప్రభుత్వ తీరుతో భారత మాత గుండెమీద గాయం అవుతోంది. అధికారం నెత్తికెక్కితే కాలమే కఠినంగా శిక్షిస్తది. అధికారం శాశ్వతం కాదు, మోదీ ప్రభుత్వానికి ఇంకా 18 నెలల సమయమే మిగిలింది. దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. బుద్ధుడు నడయాడిన, ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో ఇప్పుడేం జరుగుతోంది?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లు–పర్యవసానాలు’ అంశంపై సోమవారం ఉదయం శాసనసభలో జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క మంచి పనికూడా చేయలేని అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణించారు.

సంస్కరణలకు అందమైన ముసుగు
‘నాణ్యమైన కరెంటు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, సంస్కరణలు అనే అందమైన ముసుగు వేసి షావుకార్లకు అడ్డంగా దోచిపెట్టే దోపిడీకి తెరదీసింది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మేసుకుంటూ, ఆర్టీసీ లాంటి సంస్థలను తీసేస్తే రూ.వేయి కోట్లు చొప్పున బహుమతి ఇస్తానని చెప్తున్న కేంద్రం..  వ్యవసాయ, విద్యుత్‌ రంగాలను కూడా షావుకార్ల చేతుల్లో పెట్టేవరకు నిద్రపోను అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పంట ఉత్పత్తులను ధర ఎక్కువగా ఉండే ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చంటూ వ్యవసాయ చట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించడంలోని లోగుట్టును గుర్తించలేమా? బాన్సువాడ రైతు పంటను పంజాబ్‌కు తీసుకెళ్లి అమ్ముకోగలడా? ఈ మహానుభావుల పుణ్యాన పెరిగిన డీజిల్‌ ధరలతో అది సాధ్యమా? ఎరువుల ధరలు, దున్నే ఖర్చులు, కోసే ఖర్చులు పెరిగి భరించలేక తట్టాపార కిందపెట్టాలి. అప్పుడు సూట్‌కేసులు పట్టుకుని షావుకార్లు దిగుతరు. మీ పొలాలను మాకు అప్పగించండి, మీరు మా దగ్గర కూలీలుగా పనిచేయండి అంటరు. ఇదే మోదీ ప్రభుత్వం అసలు లోగుట్టు. ఇలా షావుకార్లకు అప్పగించేందుకే ఈ సంస్కరణల భాగోతం’ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంస్కరణలు అమల్లోకొస్తే ప్రీపెయిడ్‌ మీటర్లే..
‘సమైక్య రాష్ట్రంలో సరైన కరెంటు దొరక్క అన్ని వర్గాలు ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే. సొంత రాష్ట్రం వచ్చాక పరిస్థితిని చక్కదిద్దుకుందామంటే ఆది నుంచి కేంద్రం కుట్రలు చేస్తూనే ఉంది. మోదీ తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు పవర్‌ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. తాజాగా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ రంగం విషయంలో, రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చట్ట సవరణ బిల్లులో కూడా అదే జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కరెంటు కనెక్షనే ఉండదన్న విషయాన్ని రాష్ట్రాల అభిప్రాయంతో ప్రమేయం లేకుండా పొందుపరిచింది. కేంద్ర విద్యుత్‌ సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు లేకుండా ఎలాంటి కరెంటు కనెక్షన్‌ అయినా ఇవ్వడానికి వీలు ఉండదు..‘ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

ఇదీ మోదీ ఘనత..
‘తెలంగాణ ఆవిర్భవించిన 2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 970 యూనిట్లు కాగా, జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ తలసరి వినియోగం 2,126 యూనిట్లకు చేరితే, జాతీయ వినియోగం కేవలం 1,255 యూనిట్లకు మాత్రమే చేరింది. ఇవి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు. ఇక ఇంటర్నేషనల్‌ అథారిటీ లెక్కలు పరిశీలిస్తే, ఐస్‌ల్యాండ్‌ తలసరి వినియోగం 51,696 యూనిట్లు, యూఎస్‌ 12,154, జపాన్‌ 7,150, చైనా 6,312, భూటాన్‌ వినియోగం 3,126 యూనిట్లుగా ఉంది. 140 దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు 104. ఇది విశ్వగురువు ఘనత..’ అని ఎద్దేవా చేశారు. 

చేష్టలుడిగిన సర్కార్‌..
‘ఒక చిన్న సర్దుబాటుతో బిహార్‌ దుఖదాయినులుగా ముద్రపడ్డ కోసి, గండకి నదులపై విద్యుదుత్పత్తి ప్రారంభిస్తే ఇటు కరెంటు అందుబాటులోకి వస్తుంది. అటు వరదల బాధా తప్పుతుంది. అలాంటి సలహా ఇచ్చినా చేయలేని అసమర్ధ ప్రభుత్వం మోదీది. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయగలిగే 2,42,890 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించలేని దుస్థితి నెలకొంది. ఇది కాకుండా వనరుల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వేరియబుల్‌ పవర్‌ మరో 1.60 లక్షల మెగావాట్ల మేర ఉంది. చివరకు చెత్తనుంచి కూడా విరివిగా కరెంటును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నా మోదీ ప్రభుత్వం చేష్టలుడిగిపోయింది’ అని కేసీఆర్‌ విమర్శించారు.

ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement