‘షాక్’ దుమారం | electricity employees protests on AE suspension | Sakshi
Sakshi News home page

‘షాక్’ దుమారం

Published Sun, Dec 29 2013 2:16 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM

electricity employees protests on AE suspension

సాక్షి, సంగారెడ్డి:  గజ్వేల్ మండలం అక్కారంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటనకు బాధ్యుడిగా స్థానిక ఏఈ అనిల్ కుమార్‌ను సస్పెండ్ చేయడం ఆ శాఖ ఉద్యోగుల్లో దుమారం రేపింది. గత గురువారం రాత్రి అక్కారం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై  బుడిగె రాజు(35), బుడిగె చంద్రయ్య(28) మృతి చెందిన విషయం తెలిసిందే. సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు .. స్థానిక ఏఈ అనిల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏడీఈలు, ఏడీఏలు, ఏఈలు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, హెల్పర్లు భారీ సంఖ్యలో సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజనీర్(ఎస్‌ఈ) కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

 కార్యాలయంలో ఆవరణలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కె.రాములను ముట్టడించి ఘెరావ్ చేశారు. విచారణ జరపకుండా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఏఈని సస్పెండ్ చేయడం సరికాదనీ,  వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేసి విచారణ జరిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విద్యుదాఘాతం జరిగిన ఎస్సీ కాలనీలో మొత్తం 43 విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో కేవలం మూడు కనెక్షన్లకు మాత్రమే అధికారికంగా అనుమతి పొందినవి ఉన్నాయని, మిగిలినవి అక్రమ కనెక్షన్లేనని ఆరోపించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ మృతి చెందితే తమ బాధ్యత కాదని ఎస్‌ఈతో వాదించారు.

 అనంతరం ఎస్‌ఈ తన చాంబర్‌లో ఉద్యోగ సంఘం నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమయంలో ఉద్యోగులంతా ఆయన చాంబర్‌లోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన వీడకపోవడంతో ఎస్‌ఈ రాములు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులను ఫోన్‌లో సంప్రదించి విషయాన్ని తెలియజేశారు.  ఏఈ అనీల్ సస్పెన్షన్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సీజీఎం పీరయ్య హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణాలను శోధించడానికి సీజీఎం పీరయ్య ఆదివారం అక్కారంను సందర్శించి విచారణ జరపనున్నారని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement