షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్‌! | The victims demanded justice from Sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్‌!

May 9 2024 5:29 AM | Updated on May 9 2024 5:30 AM

వైఎస్సార్‌ జిల్లా గుర్రాలచింతలపల్లెలో నిలదీసిన స్థానికులు

అనిల్‌కుమార్‌ పేరు చెప్పి కొండలరావు మైనింగ్‌ వాహనాలను బాడుగకు తీసుకున్నాడు

గట్టిగా అడిగితే మీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు

దాదాపు రూ.4 కోట్లు ఎగ్గొట్టారు

తమకు న్యాయం చేయాలంటూ షర్మిలను డిమాండ్‌ చేసిన బాధితులు

సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్‌కుమార్‌ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్‌ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేరిట 163 ఎకరాల్లో ఐరన్‌ ఓర్‌ లీజు లభించింది.

వేణుగోపాల్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్‌.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్‌ అడ్రస్‌లో ఉంది. ఏపీఆర్‌ 2278 నంబర్‌తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్‌ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్‌ ఓర్‌ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్‌ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్‌డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. 

ఆ తర్వాత బకాయిలు పెండింగ్‌ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది.

 తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్‌ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్‌పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్‌డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు.  

మాకు న్యాయం చేయండి.. 
ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

షర్మిల, అనిల్‌ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాం
బెనిటా మైన్స్‌లో టిప్పర్లు, బుల్‌డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టు­కొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావ­డం లేదు. వైఎస్‌ కుటుంబానికి విధే­యులమైన మేము షర్మిల, అనిల్‌ వల్లే ఇంతకాలం కొండల­రావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.

మహేశ్వరరెడ్డి­తో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదా­పు రూ.4 కోట్లకు పైగా ఇవ్వా­ల్సి ఉంది. షర్మిల, అనిల్‌ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్‌ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం.   – గౌరీశంకర్‌రెడ్డి, గుర్రాలచింతలపల్లె  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement