రెచ్చిపోయి వ్యవహరిస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు
గోపువానిపాలెంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పలుచోట్ల శిలాఫలకాల తొలగింపు
సాక్షి నెట్‌వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.
మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్‌లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్‌అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శిలాఫలకాలపై గునపాలతో దాడి
కాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్‌తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.
ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్‌సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.
సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్‌వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment