vandalized
-
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్‌తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్‌రెడ్డి తెలిపారు. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
కేశనకుర్రుపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ఐ.పోలవరం : గుర్తుతెలియని దుండగులు కేశనకుర్రుపాలెం సంత మార్కెట్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడినట్టు గురువారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మండలంలోని దళిత నేతలకు, ప్రజలకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పెద్ద ఎత్తులో చేరుకున్న దళిత నాయకులు రహదారులపై బైఠాయించి ధర్నా చేశారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఉన్న స్థానే నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ స్థలానికి పంచాయతీ తీర్మానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి దళిత సంఘాల నేతలతో చర్యలు జరిపారు. దోషులను త్వరిత గతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ధ్వంసమైన విగ్రహం స్థానే పంచాయతీ తీర్మానం చేసి కాంస్య విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్‌కుమార్, భూపతిరాజు సుదర్శనబాబు, మండల కన్వీనర్ పిన్నంరాజు వెంకటపతిరాజు తదితరులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పొన్నాడ మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా అధ్యక్షుడు రేవు అప్పలస్వామి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కాశి శ్రీహరి, కాశి పరివాజ్ కుమార్, జనిపెల్ల విప్లవ్‌కుమార్, మోకా రవి, దుక్కిపాటి సత్యనారాయణ, ఎం.టి.ప్రసాద్, తదితరులు ఉన్నారు. డీఎస్పీ విచారణ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ పరిశీలించి, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. జాగిలాలు కిలోమీటరు దూరంలో ఉన్న జైభీమ్ నగర్లో ఒక బావి వద్ద ఆగిపోయాయి. డీఎస్పీ మాట్లాడుతూ దోషులను తొందర్లోనే గుర్తిస్తామన్నారు. ఈయన వెంట అమలాపురం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సైలు ప్రభాకరావు, క్రాంతి కుమార్, దుర్గా శేఖర్‌రెడ్డి, భారీస్దాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పడంతో గురువారం మధ్యాహ్నం పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిపై సరైన స్పష్టత రాకపోవడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేస్తున్న దళిత సంఘాలతో రాత్రి ఎమ్మెల్యే బుచ్చిబాబు చర్చలు జరిపారు. తనసొంత ఖర్చులతో శుక్రవారం విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దోషులను కఠినంగా శిక్షించేందుకు హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాలు ఆందోళను తాత్కాలికంగా నిలిపివేశాయి. -
ఢిల్లీలో క్రిస్టియన్ స్కూలుపై దాడి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని దక్షిణ ప్రాంతంలో క్రిస్టియన్ స్కూలుపై దుండగులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే పిల్లలను ఇళ్లకు పంపించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు సమూహంగా వచ్చి మొదట సీసీటీవీని ధ్వంసం చేసినట్టు ఫుటేజ్‌లో రికార్డు అయింది. రాజధాని ప్రాంతంలో చర్చిలపై దాడులు జరగటం ఏడాదిలోపే ఇది ఆరోసారి. ఈ గ్రూపులో ముగ్గురు నుంచి నలుగురు నిందితులు ఉన్నారు. దుండగులు విలువైన సామాన్లు ఏవీ ఎత్తుకుపోలేదు. కేవలం ప్రిన్సిపాల్ గది మాత్రమే ధ్వంసం చేసి రూ. 8 వేలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఆధారాల కోసం సీనియర్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దుండగులపై వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ స్కూల్లోనే చదివారు.