ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.
ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్‌మైదాన్‌లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.
నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్‌లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్‌మైదాన్‌ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.
సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్‌మైదాన్‌ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్‌గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.
తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్‌సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.
విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్‌లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.
గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.
టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment