akkaram
-
వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!
సాక్షి, గజ్వేల్: అసలే పేదరికం... ఆపై విధి వెక్కిరింతతో గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో ఓ యువకుని జీవనం నరకప్రాయంగా మారింది. పుట్టుకతోనే మతిస్థిమితం వైకల్యానికితోడూ నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో అతనికి 24ఏళ్లుగా కంటికి కునుకు కరువైంది. స్థోమత లేనికారణంగా ఖరీదైన వైద్యం చేయించుకోలేక, వ్యాధి తగ్గే మార్గం కరువై బాధిత యువకునితో గురువారం తల్లి భాగ్యమ్మ మర్కూక్ మండలం ఎర్రవల్లి సంద ర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలను ఆశ్రయించింది. దీంతో వారు స్పందించి ప్రభుత్వం నుంచి రూ. 2.5లక్షల ఆర్థికసాయం అప్పటికప్పుడు అందజేశారు. కాపు కాయాల్సిందే.. అక్కారం గ్రామానికి చెందిన మాదరబోయిన భాగ్యమ్మ–రాజయ్య దంపతులకు కొడుకు సాయికుమార్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి సంతానంలో సాయికుమార్ రెండోవాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. చిన్నపాటి రేకుల ఇంటిలో ఈ కుటుంబం పూట గుడుపుకుంటుంది. కూతుర్లలో ఇద్దరి పెళ్లిళ్లు అతికష్టం మీద చేసి అత్తారింటికి పంపారు. మరో కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వింత వ్యాధితో బాధపడుతున్న సాయికుమార్, మరో కూతురు పోషణ భారం భాగ్యమ్మపై పడింది. ప్రస్తుతం భాగ్యమ్మకు వస్తున్న వితంతు పింఛన్, సాయికుమార్‌కు వస్తున్న వికలాంగుల పింఛన్‌తో పాటు కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. చిన్నతనం నుంచి సాయికుమార్‌కు మతిస్థిమితంతో పాటు నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో తల్లి నానా ఇబ్బందులు పడుతోంది. రాత్రయిందంటే చాలు ఆమె గుండెల్లో గుబులు పుడుతుంది. రాత్రి సమయంలో కంటికి కునుకు రాని తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోతాడోనని తల్లడిల్లుతోంది. గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా. ఎక్కడైనా తప్పిపోతే అతను చెప్పే వచ్చిరానీ మాటలతో ఎవరైనా సమాచారం అందిస్తే తిరిగి ఇంటి వద్దకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా అదే గుబులు తల్లిని వెంటాడుతోంది. సాయికుమార్ కోసం తల్లి కూడా నిద్రపోకుండా చాలాసేపు కాపు కాస్తుంది. పక్కింటివాళ్ల సాయంతో కొన్ని సందర్భాల్లో బయటకు రాకుండా గదిలో ఉంచడంతో అటో.. ఇటో కాలం గడుపుతోంది. యువకుని జీవితానికి నరకప్రాయంగా మారిన ఈ వ్యాధి నయమైతే తమ కుటుంబంలో వెలుగు వస్తుందని ఆరాటపడుతు న్నా... వైద్యం చేయించుకోవడానికి స్థోమత లేక ఆందోళన చెందుతోంది. ఇదే క్రమంలో గురువా రం మర్కూక్ మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లికి మాజీ మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిలు వస్తున్నారన్న స మాచారం తెలుసుకున్న భాగ్యమ్మ తన కొడుకును వెంట తీసుకొని వారిని కలిసింది. తన కుమారుని పరిస్థితిని వివరించగా... చలించిన హరీశ్‌రావు, కలెక్టర్‌అప్పటికప్పుడే రూ. 2.5లక్షల ఆర్థికసా యం చెక్కును అందజేశారు. యువకుడి పరిస్థితి నయమయేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో బాధిత కుటుంబానికి ఊరట లభించినట్లయ్యింది. -
‘షాక్’ దుమారం
సాక్షి, సంగారెడ్డి: గజ్వేల్ మండలం అక్కారంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటనకు బాధ్యుడిగా స్థానిక ఏఈ అనిల్ కుమార్‌ను సస్పెండ్ చేయడం ఆ శాఖ ఉద్యోగుల్లో దుమారం రేపింది. గత గురువారం రాత్రి అక్కారం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై బుడిగె రాజు(35), బుడిగె చంద్రయ్య(28) మృతి చెందిన విషయం తెలిసిందే. సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు .. స్థానిక ఏఈ అనిల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏడీఈలు, ఏడీఏలు, ఏఈలు, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, హెల్పర్లు భారీ సంఖ్యలో సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజనీర్(ఎస్ఈ) కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్యాలయంలో ఆవరణలో ట్రాన్స్‌కో ఎస్ఈ కె.రాములను ముట్టడించి ఘెరావ్ చేశారు. విచారణ జరపకుండా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఏఈని సస్పెండ్ చేయడం సరికాదనీ, వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేసి విచారణ జరిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విద్యుదాఘాతం జరిగిన ఎస్సీ కాలనీలో మొత్తం 43 విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో కేవలం మూడు కనెక్షన్లకు మాత్రమే అధికారికంగా అనుమతి పొందినవి ఉన్నాయని, మిగిలినవి అక్రమ కనెక్షన్లేనని ఆరోపించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ మృతి చెందితే తమ బాధ్యత కాదని ఎస్ఈతో వాదించారు. అనంతరం ఎస్ఈ తన చాంబర్లో ఉద్యోగ సంఘం నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమయంలో ఉద్యోగులంతా ఆయన చాంబర్లోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన వీడకపోవడంతో ఎస్ఈ రాములు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులను ఫోన్లో సంప్రదించి విషయాన్ని తెలియజేశారు. ఏఈ అనీల్ సస్పెన్షన్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సీజీఎం పీరయ్య హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణాలను శోధించడానికి సీజీఎం పీరయ్య ఆదివారం అక్కారంను సందర్శించి విచారణ జరపనున్నారని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి.