వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..! | Young Man From Akkaram Didn't Sleep At All For 24 Years In Siddipet District | Sakshi
Sakshi News home page

వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!

Published Fri, Jul 26 2019 8:41 AM | Last Updated on Fri, Jul 26 2019 8:41 AM

Young Man From Akkaram Didn't Sleep At All For 24 Years In Siddipet District - Sakshi

సాయికుమార్‌

సాక్షి, గజ్వేల్‌: అసలే పేదరికం... ఆపై విధి వెక్కిరింతతో గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామంలో ఓ యువకుని జీవనం నరకప్రాయంగా మారింది. పుట్టుకతోనే మతిస్థిమితం వైకల్యానికితోడూ నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో అతనికి 24ఏళ్లుగా కంటికి కునుకు కరువైంది. స్థోమత లేనికారణంగా ఖరీదైన వైద్యం చేయించుకోలేక, వ్యాధి తగ్గే మార్గం కరువై బాధిత యువకునితో గురువారం తల్లి భాగ్యమ్మ మర్కూక్‌ మండలం ఎర్రవల్లి సంద ర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు,  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిలను ఆశ్రయించింది. దీంతో వారు స్పందించి ప్రభుత్వం నుంచి రూ. 2.5లక్షల ఆర్థికసాయం అప్పటికప్పుడు అందజేశారు. 

కాపు కాయాల్సిందే..
అక్కారం గ్రామానికి చెందిన మాదరబోయిన భాగ్యమ్మ–రాజయ్య దంపతులకు కొడుకు సాయికుమార్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి సంతానంలో సాయికుమార్‌ రెండోవాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఈ కుటుంబానికి రెక్కల కష్టమే జీవనాధారం. చిన్నపాటి రేకుల ఇంటిలో ఈ కుటుంబం పూట గుడుపుకుంటుంది. కూతుర్లలో ఇద్దరి పెళ్లిళ్లు అతికష్టం మీద చేసి అత్తారింటికి పంపారు. మరో కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వింత వ్యాధితో బాధపడుతున్న సాయికుమార్, మరో కూతురు పోషణ భారం భాగ్యమ్మపై పడింది.

ప్రస్తుతం భాగ్యమ్మకు వస్తున్న వితంతు పింఛన్, సాయికుమార్‌కు వస్తున్న వికలాంగుల పింఛన్‌తో పాటు కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. చిన్నతనం నుంచి సాయికుమార్‌కు మతిస్థిమితంతో పాటు నిద్రలేమి వ్యాధి సంక్రమించడంతో తల్లి  నానా ఇబ్బందులు పడుతోంది. రాత్రయిందంటే చాలు ఆమె గుండెల్లో గుబులు పుడుతుంది. రాత్రి సమయంలో కంటికి కునుకు రాని తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోతాడోనని తల్లడిల్లుతోంది. గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా. ఎక్కడైనా తప్పిపోతే అతను చెప్పే వచ్చిరానీ మాటలతో ఎవరైనా సమాచారం అందిస్తే తిరిగి ఇంటి వద్దకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా అదే గుబులు తల్లిని వెంటాడుతోంది. సాయికుమార్‌ కోసం తల్లి కూడా నిద్రపోకుండా చాలాసేపు కాపు కాస్తుంది. పక్కింటివాళ్ల సాయంతో కొన్ని సందర్భాల్లో బయటకు రాకుండా గదిలో ఉంచడంతో అటో.. ఇటో కాలం గడుపుతోంది.

యువకుని జీవితానికి నరకప్రాయంగా మారిన ఈ వ్యాధి నయమైతే తమ కుటుంబంలో వెలుగు వస్తుందని ఆరాటపడుతు న్నా... వైద్యం చేయించుకోవడానికి స్థోమత లేక ఆందోళన చెందుతోంది. ఇదే క్రమంలో గురువా రం మర్కూక్‌ మండలంలోని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లికి మాజీ మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిలు వస్తున్నారన్న స మాచారం తెలుసుకున్న భాగ్యమ్మ తన కొడుకును వెంట తీసుకొని వారిని కలిసింది.  తన కుమారుని పరిస్థితిని వివరించగా... చలించిన  హరీశ్‌రావు, కలెక్టర్‌అప్పటికప్పుడే రూ. 2.5లక్షల ఆర్థికసా యం చెక్కును అందజేశారు. యువకుడి పరిస్థితి నయమయేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో బాధిత కుటుంబానికి ఊరట లభించినట్లయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఆర్థికసాయం అందజేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement