రేవంత్ మాటమార్చి బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్‌రావు | Minister Harish Rao Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

3 గంటల కరెంట్ చాలని రేవంత్‌ అన్నడు.. ఇప్పుడు బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్‌రావు

Published Wed, Nov 8 2023 6:14 PM | Last Updated on Wed, Nov 8 2023 6:34 PM

Minister Harish Rao Comments On Revanth Reddy - Sakshi

సాక్షి, సిద్ధిపేట జిల్లా: డీకేలు వచ్చినా, పీకేలు వచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. తొలుత గజ్వేల్‌లో నామినేషన్‌ వేసి.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కామారెడ్డి చేరుకుంటారు. అక్కడా నామినేషన్‌ వేసి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఐఓసీ మైదానం వద్ద హెలి ప్యాడ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎంతో గజ్వేల్ లో ఈనెల 28వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018లో కూడా ముగింపు సభ గజ్వేల్‌లో నిర్వహించాం. రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కేసీఆర్‌కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్‌లో సీఎం పూర్తి చేశారు. కరవు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది’’ అని మంత్రి పేర్కొన్నారు.

గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా కేసీఆర్‌ మార్చారు. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్‌కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్కి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్‌లో గెలిచి తీరుతాం’’ అని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

‘‘కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే. కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్లు ఉంటే ఆ గౌరవం గజ్వేల్‌కు ఉంటుందా? పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కేసీఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బీజేపీ రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్లు, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.

‘‘పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. ఖుల్లం ఖుల్లా అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్లు కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది’’ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement