సాక్షి, హైదరాబాద్: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగుల వివాదం కొలిక్కి వస్తోంది. వేతనాలు, వేతన బకాయిలు ఇస్తామన్న ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ హామీపై తెలంగాణ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఆ రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని రిలీవ్ ఉద్యోగులు తెలిపారు. ఈ నెల 19 వరకూ వేతన బకాయిలు చెల్లిస్తామని టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ భరోసా ఇచ్చారని, హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పినట్టు తెలిపారు.
దీన్నిబట్టి త్వరలోనే తమను విధుల్లోకి తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా 1,252 మంది ఉద్యోగులను జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారిని తిరిగి తీసుకోవాలని, వేతన, బకాయిలను రెండు రాష్ట్రాలూ దామాషా పద్ధతిలో చెల్లించాలని కోర్టు సూచించిన విషయం తెలిసిందే.
కొలిక్కి వస్తున్న విద్యుత్ రిలీవ్ ఉద్యోగుల వివాదం
Published Wed, Oct 14 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement