‘విద్యుత్ విభజన’ పరిష్కారానికి కమిటీ | "Electricity separation" to resolve the committee | Sakshi
Sakshi News home page

‘విద్యుత్ విభజన’ పరిష్కారానికి కమిటీ

Published Sat, Mar 12 2016 2:06 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM

‘విద్యుత్ విభజన’ పరిష్కారానికి కమిటీ - Sakshi

‘విద్యుత్ విభజన’ పరిష్కారానికి కమిటీ

♦ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం
♦ ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు
♦ పేర్లను కోర్టుకు సమర్పించిన ఇరువురు ఏజీలు
 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని ఉమ్మడి హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి నలుగురు చొప్పున, ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక్కొక్కరు ఉంటా రు. ఈ కమిటీ గరిష్టంగా ఈ నెలాఖరులోపు విభజన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శకాలను తాము పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామంది.

తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, వాటికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.

 ఉభయ రాష్ట్రాల సమ్మతి..
 గురువారం విచారణ సమయంలో ధర్మాసనం ప్రతిపాదించిన కమిటీ ఏర్పాటుకు శుక్రవారం ఉభయ రాష్ట్రాలు తమ సమ్మతిని తెలియచేశాయి. దీనికి ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు జీతభత్యాల కింద రూ.100 కోట్లు చెల్లించామని, ఇప్పుడు కమిటీ ఏర్పాటు వల్ల ఈ వ్యవహారంలో జాప్యం జరిగే అవకాశం ఉందనే ఆందోళన తమకుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలను చూస్తామని, అప్పటి వరకు పిటిషన్లను పెండింగ్‌లోనే ఉంచుతామని తెలిపింది. మా విధానాలు మేం రూపొందించుకున్నామని ఉభయ ప్రభుత్వాలు చెబుతుంటే సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటు వల్లే పరిష్కారం లభించగలదని పేర్కొంది.

 కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..
 గతంలోనే నాలుగు పేర్లను సిఫార్సు చేశామని, ఐదో వ్యక్తి పేరును కూడా ఇప్పుడు సూచిస్తున్నామంటూ ఏపీ ఏజీ ఓ కాగితాన్ని ధర్మాసనం ముందుంచారు. అంతకు ముందే తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి ఐదుగురు పేర్లను ధర్మాసనం ముందుంచారు. ఇరు ప్రభుత్వాలు సమర్పించిన పేర్లను పరిశీలించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ, కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. మార్చి నెలాఖరుకల్లా మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీని ఆదేశించింది. ఇరు రాష్ట్రాల ఏజీలు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ సమావేశంలో పాల్గొనవచ్చునని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జనాభా ప్రతిపాదికన కమిటీ చైర్మన్‌కు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుందని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు ఇరు ఏజీలు అంగీకరించారు.

 కమిటీలో సభ్యులు వీరే..
 ఏపీ నుంచి రాహుల్ పాండే (స్పెషల్ సెక్రటరీ, ఇంధనశాఖ), ఉషా, జాయింట్ సెక్రటరీ (ట్రాన్స్‌కో), హెచ్.వై.దొర (సీఎండీ, ఎస్‌పీడీసీఎల్), ముత్యాలరాజు (సీఎండీ, ఈపీడీసీఎల్), దినేష్ పరుచూరి (ట్రాన్స్‌కో డెరైక్టర్, ఫైనాన్స్), తెలంగాణ నుంచి అరవిందకుమార్ (ముఖ్య కార్యదర్శి, ఇంధనశాఖ), రఘుమారెడ్డి (సీఎండీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్), వెంకట నారాయణ (సీఎండీ, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్), అశోక్‌కుమార్ (డెరైక్టర్, టీఎస్‌జెన్‌కో), నర్సింగరావు (జేఎండీ, టీఎస్ ట్రాన్స్‌కో).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement