CMD Prabhakar Rao
-
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్‌టీఎల్‌ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ పంపు సెట్ల వద్ద రైతులు పెట్టుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను వెంటనే తొలగించాలని కింది స్థాయి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు.. వెంటనే సంబంధిత జిల్లాల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈలు ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీడీసీఎల్ సీజీఎం (ఆపరేషన్స్) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు (మెమో 3817/22–23) జారీ చేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అధిక ధరతో కొన్న విద్యుత్తు వృ«థా అవుతోందనే.. వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఆటోమెటిక్ స్టార్టర్లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్ వృధా అవుతోందని, దాంతోపాటు సాగు నీరు కూడా వృథా అవుతోందని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఏసీడీ పేరిట కేసీఆర్ పన్ను
జగిత్యాలటౌన్: విద్యుత్ సంస్థలోని నష్టాలు పూడ్చుకునేందుకే వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సంస్థను నిర్వహించడంలో విఫలమైన సీఎండీ ప్రభాకర్‌రావు తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఏసీడీ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న కేసీఆర్ పన్నును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి నిర్దిష్ట విద్యుత్ సరఫరా వేళలు ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతిభవన్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. తొలుత ఇందిరాభవన్ నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో విద్యుత్ ప్రగతిభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయని, సీఎం కేసీఆర్ ఇలాఖాలో ఏసీడీ చార్జీలు లేవని, కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే ఉత్తర తెలంగాణ ప్రజలపైనే భారం ఎందుకని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించిన ప్రభుత్వం..ప్రజలపై రూ.40వేల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు జగిత్యాల నుంచి ఉద్యమం మొదలుపెడతామని ఆయన హెచ్చరించారు. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో విద్యుత్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ‘సాంకేతిక సామర్థ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర డిస్కంల కంటే ముందున్నా...ఆర్థికంగా కొంత వెనుకబడిపోయాయి. నష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా పంపిణీ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు గట్టెక్కాలంటే మీటర్ సేల్స్ పెంచాలి. అంతర్గత వృథా ఖర్చులు తగ్గించుకోవాలి’ అని తెలంగాణ విద్యుత్ (టాన్స్‌కో,జెన్కో) సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డా రు. శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ–2023 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు కొంత మెరుగ్గా ఉన్నా.. పంపిణీ సంస్థలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా సహకరిస్తున్నా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నష్టాల్లో ఉన్న సంస్థలను ఇక లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది. లేదంటే సంస్థల మనుగడే కాదు ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజుకో రకమైన సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. విద్యుత్ సంస్థలకు ఈ క్రైం సవాల్ విసురుతోంది. ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. సైబర్ నేరగాళ్లకు సంస్థలు చిక్కకుండా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆర్థిక వనరులు వారి చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది. అకౌంటెంట్లు కేవలం అకౌంట్స్‌ను నిర్వహించడమే కాదు బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెన్ చేయాలి. సంస్థ ఖాతాలో నిల్వలు ఉన్నప్పుడే అవసరానికి, అభివృద్ధి పనులకు బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. నిల్వలు లేక పోతే అప్పులు కూడా పుట్టవు.’అని సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆ డబ్బులు సొంతానికి వాడుకుంటే ఎలా? సీఎండీ రఘుమారెడ్డి ‘వినియోగదారుల నుంచి వసూలు చేసిన విద్యుత్ బిల్లులను, వెంటనే సంస్థ ఖాతాలో జమ చేయడం లేదు. వీటిని కొంత మంది ఉద్యోగులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. వరుస డోర్‌లాక్‌లు, మీటర్ స్టకప్‌లు వంటి అంశాలను ఈఆర్ఓలు మానిటరింగ్ చేయడం లేదు. పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకుంటే ఎలా? ఈఆర్ఓ కేంద్రాల్లోని అకౌంటెంట్లు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు బిల్లులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా..? ఈఆర్ఓ కో ఆర్డినేషన్ మీటింగ్‌లో ఏం చర్చిస్తున్నారు? అన్‌బిల్డ్ సర్వీసులపై ఎందుకంత నిర్లక్ష్యం? ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సర్వీసులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. సెక్షన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, వృధా ఖర్చులు, విద్యుత్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత అకౌంటెంట్లపైనే ఉంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, జెన్కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నరసింహ్మారావు, టీఆర్కే రావు, తిరుపతిరెడ్డి, వీఏఓఏటీ అధ్యక్షుడు ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ గ్రిడ్‌పై డ్రా‘గన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై చైనా నుంచి సైబర్ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్ సిస్టంలతో ‘కమ్యూనికేట్’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశ సైబర్ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్కోఅప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంది. సీఈఆర్టీ–ఇన్ గుర్తించి పంపిన ‘చైనీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్‌లను ట్రాన్స్‌కో బ్లాక్ చేసింది. దీంతో చైనీస్ సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఈ సర్వర్లు.. ట్రాన్స్‌కో, ఎస్ఎల్డీసీకు చెందిన కంప్యూటర్ సిస్టంలతో కమ్యూనికేట్ కావడానికి దారులు మూసేసినట్టు అయింది. - హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఉన్న లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లలోని సర్క్యూట్ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ పనిచేయకుండా తాత్కాలికంగా డిజేబుల్ చేసింది. దీంతో హాకర్లు రిమోట్ ఆపరేషన్ ద్వారా గ్రిడ్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి, కుప్పకూల్చడానికి అవకాశం లేకుండా పోయింది. - దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వెబ్‌సైట్‌కు సంబంధించి లాగిన్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. - గ్రిడ్ భద్రతను కట్టుదిట్టం చేయడానికి .. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ (స్కాడా) కంట్రోల్ సెంటర్ పరిధి నుంచి అనుమాస్పద పరికరాలను దూరంగా తరలించి ఐసోలేట్ చేశారు. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరాలను గుర్తించి స్కాడా పరిధి నుంచి దూరంగా తరలించారు. రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. నష్టమేంటి! సైబర్ నేరగాళ్లు మన విద్యుత్ సంస్థల కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కుప్పకూలితే విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. కొన్ని గంటల పాటు కరెంటు ఉండదు. పరిస్థితి తీవ్రతను బట్టి ఈ సమయం పెరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. థర్మల్ పవర్స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్ చేస్తూ... పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు అంటే? హాకింగ్, సైబర్ దాడుల కోసం సైబర్ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్ అండ్ కంట్రోల్ (సీ అండ్ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు. సిస్టమ్స్‌లో మాల్వేర్ చొప్పించి ఈ దాడులకు పాల్పడుతారు. ఈ ప్రక్రియ అంతటికీ కమ్యూనికేట్ కావడమే కీలకం. ఒకసారి గనక సైబర్ నేరగాళ్లు మన వ్యవస్థలో ఒక సిస్టంతో సంబంధాలు నెలకొల్పుకోగలిగితే చాలు. ఆపై మొత్తం నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ముంబై తర్వాత టార్గెట్ హైదరాబాద్? చైనా నుంచి సైబర్ దాడుల ఫలితంగానే గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ముంబై నగరం అంధకారమైందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సోమవారం సంచలన కథనం రాసింది. గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్న ఉద్దేశంతో చైనా ఈ సైబర్ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరుసటి రోజే సీఈఆర్టీ–ఇన్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చైనా నుంచి సైబర్ దాడులకు పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరికలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ఎన్నో వ్యూహాత్మక సంస్థలకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు ప్రయత్నాలు చేసినట్టు తాజా హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. అంతటా ఆటోమేషన్.. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ముందే మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్ నేరస్థులు హైజాక్ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది. గతేడాది కేంద్రం హెచ్చరికలు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. చైనా నుంచే అత్యధిక దిగుమతులు చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. -
నిరంతర వర్షాలు.. భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్‌ని అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతొ విద్యుత్ డిమాండ్ 12 వేల వాట్స్ నుంచి 4300 వాట్స్‌కి పడిపోయింది. దాంతో ఓల్జేట్ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. లోడ్ డిస్పాచ్ చేయిస్తున్నారు. ఇక 1500 మెగావాట్స్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర రావు మాట్లాడుతూ.. ‘విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశాము. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయగలరు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, నీరు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపండి. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. అలా అయితే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది’ అని తెలిపారు. -
15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్‌స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. జపాన్ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్లో ప్యానల్ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగల భద్రతే ముఖ్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు అన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్ యూనిట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరో యూనిట్ సీజ్ శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్‌రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్‌ను సీజ్ చేశారు. విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్‌రావు, సురేష్, టెక్ని కల్ ఎస్ఈ హనుమాన్ పాల్గొన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎండీ ప్రభాకర్
-
శ్రీశైలం ప్రమాదం; పూర్తిగా కాలిపోయిన 4వ యూనిట్
సాక్షి, శ్రీశైలం: జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, ‘దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగింది కానీ పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదు. 4వ యూనిట్ లో నష్టం ఎక్కువగా జరిగింది. 1,2 యూనిట్స్ బాగానే ఉన్నాయి, 5 కూడా బాగానే ఉంది. 6వ యూనిట్ లో ప్యానెల్ దెబ్బ తింది. ఆరవ యూనిట్లో ప్రారంభమయిన మంటలు మిగతా యూనిట్లుకు అంటుకున్నాయి, నాల్గో యూనిట్ పూర్తిగా కాలిపోయింది. అందరూ అన్నట్లు వేల కోట్ల నష్టం జరుగలేదు, దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగింది. అదే చాలా బాధాకరం. త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభిస్తాం. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను మళ్లీ జరగకుండా ఏమి చేయాలో అన్నీ చేస్తాం. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల ఉద్యోగులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఉద్యోగులపై ఎంతో విశ్వాసం, అభిమానం ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం ముఖ్యం. ప్లాంటులో ప్రమాదం జరిగి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం పట్ల తెలంగాణ ప్రజలంతా దిగ్భాంతికి గురయ్యారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా మనమంతా మరోసారి పునరంకితమై పనిచేయాలి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. వారిని ఎలా ఆదుకోవాలనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. తన సోదరుడు శ్రీనివాసరావు మరణించాడన్న వార్త తెలిసిన తరువాత కూడా ఆయన ప్లాంటులో పర్యటించారు. తన సొంత అన్న మరణించిన దుఃఖాన్ని పంటి బిగువన దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రభాకర్ రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడి మరణం పట్ల విచారం, సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం -
సరికొత్త వెలుగులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక–మణుగూరు సరిహద్దులో 1,080 మెగావాట్ల (270‘‘4) విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో శుక్రవారం మొదటి యూనిట్ నుంచి సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రక్రియ విజయవంతం అయింది. దీంతో బీటీపీఎస్ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్ మొదటి యూనిట్ నుంచి గంటకు 19.556 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్ బీటీపీఎస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్ మొదటిది. బీహెచ్ఈఎల్ సంస్థకు జెన్కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీవోడీ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్ నుంచి 2019 సెప్టెంబరు 19న సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీవోడీ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతం గా పూర్తి చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతం కావడంతో సీవోడీ ప్రక్రియ పూర్తయింది. ఇక రెండు, మూడు యూనిట్ల నిర్మాణం సైతం 70 శాతం పూర్తయినట్లు జెన్కో అధికారులు తెలిపారు. కొత్త సేవలపై హర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) ఆరు దశాబ్దాలుగా రాష్ట్రానికి వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. అయితే ఇందులో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కాలం చెల్లిన ఓఅండ్ఎం (1,2,3,4 దశలు) ప్లాంట్లను గత మార్చి 31న మూసివేశారు. వీటిని నిర్మించి 50 ఏళ్లు దాటడంతో నిబంధనల మేరకు మూసివేశారు. అయితే కేటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో సమస్య తీరింది. 2018 డిసెంబర్ 26న కేటీపీఎస్ 7వ దశ సీవోడీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రస్తుతం (720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 1, 2, 3, 4 దశలు మూసేశాక) ఇక్కడి నుంచి 7వ దశతో కలుపుకొని 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. తాజాగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రస్తుతం 2,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చినట్లయింది. కాగా బీటీపీఎస్ విజయవంతం కావడంతో సిబ్బందికి సీఎండీ ప్రభాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ!
సాక్షి,హైదరాబాద్: ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ, సర్వీసు రిజిస్ట్రర్ల నిర్వహణ, తదుపరి పీఆర్సీ నుంచి వేతన సవరణ, డీఏ, హెచ్ఆర్ఏ, కన్వినియన్స్, మెడికల్ తదితర అలవెన్సులు, కారుణ్య నియామకాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో వారితో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీటఫ్) ప్రకటించింది. వరంగల్‌లో 23న తలపెట్టిన మహాధర్నాను విరమించుకుంటున్నట్లు ఫ్రంట్ చైర్మన్, కన్వీనర్ పద్మారెడ్డి, శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు శనివారం విద్యుత్ సౌధలో టీటఫ్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిగాయి.న్యాయమైన, సాధ్యమైన అన్ని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అంగీకరించారు. స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో 23 వేలమంది ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సర్వీస్ రూల్స్ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌గా మార్చుతామని అధికారులు హామీ ఇచ్చారు.1999– 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ వర్తింపు వంటి ప్రధాన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మిగిలిన డిమాండ్ల విషయంలో నవంబర్ మూడో వారంలో మరోసారి చర్చలు నిర్వహిస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చాయి.చర్చలు సఫలం కావటంతో కార్మిక సంఘాలు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించాయి.చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్ అధికారులు, కార్మికులు సంతకాలు చేశారు.చర్చల్లో ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, టీటఫ్ చైర్మన్ నాయకులు సాయిబాబు, ఎంఏ వజీర్, ఎస్. ప్రభాకర్, ఎండీ అబ్దుల్ మజీద్, సాయిలు, టీఆర్వీకేఎస్ అధ్యక్షుడు జాన్సన్, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ పాల్గొన్నారు. ఒప్పందంలోని ప్రధానాంశాలు ►స్టాండింగ్ ఆర్డర్స్ పేరును ఆర్టిజన్ల సర్వీసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌గా మార్పు ►ప్రస్తుతం ఆర్టిజన్లు పొందుతున్న కన్సాలిడేటెడ్ వేతనాన్ని సంరక్షిస్తూనే, ప్రస్తుత నోటిఫైయిడ్ స్కేల్‌కు అనుగుణంగా 2019 అక్టోబర్ 1 నాటి నుంచి ఆర్టిజన్లకు వేతన స్థిరీకరణ (పే ఫిక్సేషన్) చేస్తాం.కనీస స్కేలును వేతనం మించితే వారి వ్యక్తిగత అలవెన్సులుగా పరిగణించబడుతాయి. ►నోటిఫైయిడ్ స్కేల్ ప్రకారం వీడీఏకు బదులు డీఏ చెల్లింపు. ►హెచ్ఆర్ఏ, సీసీఏ, వైద్య ఖర్చులు, రవాణా భత్యం, కార్పొరేట్ అలవెన్స్ వర్తింపు. ►ఆర్టిజన్లందరికీ సర్వీసు రిజిస్ట్రర్లు తెరిచి సర్వీసు రిజిస్ట్రర్‌లో వేతన స్థిరీకరణ ఎంట్రీలు నమోదు ►ఆర్టిజన్లందరికీ పే స్లిప్పులు జారీ ►పెయిడ్ హాలిడేలు వర్తింపు ►తదుపరి వేతన సవరణ కాలం నుంచి ఆర్టిజన్లకు సైతం వేతన సవరణ అమలు ►2016 డిసెంబర్ 4 తర్వాత మరణించిన ఆర్టిజన్ల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన. ►ఆర్టిజన్లపై క్రమశిక్షణ చర్యలను అధీకృత అధికారి మాత్రమే పరిశీలిస్తారు ►ఆర్టిజన్లకు వర్తింపజేసిన సదుపాయాలను రెస్కో ఉద్యోగులకు వర్తింపు ►ఆర్టిజన్లకు అంత్యక్రియల చార్జీలు చెల్లింపు ►ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ అమలు చేసే అంశంపై చర్చించేందుకు టీటఫ్ బృందాన్ని సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ►యూనియన్ల ప్రతిపాదనల మేరకు ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌కు సవరణలు చేస్తారు. -
బకాయి చెల్లించకుండా బుకాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్‌సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్మెంట్ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. ‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు. ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించినట్టో... వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్‌రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. -
పులిచింతల విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితం
చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జల విద్యుత్ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవుల్లపల్లి ప్రభాకర్‌రావు జాతికి అంకితం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జలవిద్యుత్ ప్లాంట్ నాలుగో యూనిట్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యుత్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి రూ. 22 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ప్రభుత్వ సహకారం, ఇంజనీర్ల కృషితో ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ పనుల్లో ఇప్పటి వరకు రూ. 486 కోట్ల విలువగల పనులు పూర్తయినట్లు చెప్పారు. మిగతా పనులను కూడా అంచనా వ్యయానికి మించకుండా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద నీటి మీద ఆధారపడి 220 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాగర్ దిగువన ఉన్న టెయిల్‌పాండ్ రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సీఎండీ (ట్రాన్స్‌కో) జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ (గ్రిడ్) జె. నర్సింహారావు, డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) జగత్‌రెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ జెన్కో) అశోక్‌కుమార్, డైరెక్టర్ (ఎన్పీడీసీఎల్) గణపతిరావు, డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, ఎస్ఈలు సద్గుణ కుమార్, శ్రీనివాసరెడ్డి, సీఈలు సురేశ్‌కుమార్, రత్నాకర్, ఈఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
జీఐఎస్ సబ్‌స్టేషన్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్ చేసింది. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ గ్యాస్ విద్యు త్ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 870 మెగావాట్ల విద్యుత్.. మేడారం పంపింగ్ స్టేషన్లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్ లైన్ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్ చార్జింగ్ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
కేటీపీఎస్ 7వ దశ విద్యుదుత్పత్తి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్ ఏడవ దశలో శనివారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టుగా దేశ విద్యుత్ రంగంలో ఈ ప్రాజెక్టు సరికొత్త రికార్డును సృష్టించింది. తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ ఈడీ ముఖోపాధ్యాయ, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్లాంట్‌లో అధికారులు, కార్మికులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంటు చరిత్రలో నిలువనుంది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంటు కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే కేవలం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ప్లాంట్ల నిర్మాణంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడాకూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడవ దశ అందుబాటులో వచ్చిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16వేల మెగావాట్లు దాటింది. ఐడీసీ భారం తగ్గించేలా నిర్మాణం దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంటుగానే కాకుండా ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కూడా కేటీపీఎస్ చరిత్రలో నిలిచిపోనుంది. అగ్రిమెంటులో నిర్దేశించిన కాలవ్యవధిలోగా పని పూర్తి కాకపోతే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ రూపంలో అదనపు వ్యయం అవుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు భరించి, కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతిమంగా ఆ భారం ప్రజలపై పడుతోంది. అయితే నిర్ణీత సమయంకన్నా 8 నెలల ముందే నిర్మాణం పూర్తి కావడం వల్ల కేటీపీఎస్ 7నుంచి కొనుగోలు చేసే విద్యుత్తుకు ఐడీసీ భారం ఎక్కువగా పడదు. దీని వల్ల ఇక్కడి నుంచి వచ్చే విద్యుత్ కూడా చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుంది. కేటీపీఎస్7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వాడనున్నారు. దీనివల్ల సింగరేణికి లాభం జరగడంతో పాటు తెలంగాణ జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది సమష్టి కృషి: ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, విద్యుత్ అధికారులు, సిబ్బంది చేసిన సమష్టి కృషి వల్లే రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగలిగామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్లాంటు నిర్మాణానికి కష్టపడిన అధికారులు, ఉద్యోగులకు, బీహెచ్ఈఎల్కు ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు. జెన్కో పనితీరు ప్రశంసనీయం: సీఎం రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంటును నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయం అన్నారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించారన్న లక్ష్యంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్న జెన్కో సీఎండీ, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. -
సాగుకు ఉచితంగా 24 గంటలు విద్యుత్
-
సాగుకు ఉచితంగా 24 గంటలు విద్యుత్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి తాత్కాలికంగా ఐదు రోజుల పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాత మూడు జిల్లాల పరిధిలో సాగుకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి గతేడాది కాలంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కొలిక్కి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఆదివారం జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో చర్చించారు. ఐదు రోజుల తర్వాత ప్రభావాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా సీఎంకు ప్రతిపాదించారు. ఇందుకు సీఎం ఆమోదముద్ర వేశారు. జిల్లాలు, డివిజన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా ప్రభావాన్ని అంచనా వేయాలని, ఐదు రోజుల పాటు ప్రతీక్షణం సంబంధిత అధికారులు పరిస్థితిని గమనించాలని సూచించారు. తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించుకుని, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. సీఎంతో సమీక్ష అనంతరం ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీÜఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు నర్సింగ్‌రావు, జగత్‌రెడ్డిలతో ప్రభాకర్‌రావు చర్చించారు. అదనంగా 2 వేల మెగావాట్ల డిమాండ్ ఈ ఏడాది జూన్ 17 నుంచి పాత మెదక్ జిల్లా పరిధిలో, జూన్ 18 నుంచి పాత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగుకు 24 గంటల కరెంట్ అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద 23 లక్షలకు పైగా పంపుసెట్లు ఉంటే.. ఈ మూడు జిల్లాల పరిధిలో 9.58 లక్షల పంపుసెట్లున్నాయి. అంటే దాదాపు 43 శాతం పంపుసెట్లకు 24 గంటల కరెంట్‌ను విజయవంతంగా సరఫరా చేసినట్లు విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకు గరిష్టంగా 9,500 మెగావాట్ల డిమాండ్‌కు సరిపడ విద్యుత్ అందించాయి. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మొత్తం 23 లక్షలకు పైగా ఉన్న పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను విస్తరిస్తారు. ఇందుకు అదనంగా మరో 1500–2000 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. 24 గంటల కరెంట్ నా స్వప్నం: కేసీఆర్ ‘‘సమైక్య రాష్ట్రంలో మూడు నాలుగు గంటల కరెంట్ కూడా అందలేదు. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పడగానే విద్యుత్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాం. రైతులందరికీ 24 గంటల కరెంట్ ఇవ్వాలన్నది నా స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి కష్టపడుతున్న విద్యుత్ ఉద్యోగులందరికీ అభినందనలు. మిషన్ కాకతీయతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. రైతులు బంగారు పంటలు పండించగలుగుతారు. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసే 24 గంటల కరెంటు సరఫరా తప్పక విజయవంతమవుతుంది’’అని ముఖ్యమంత్రి కేసీఆర్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో అన్నారు. విద్యుత్ సంస్థలకు గర్వకారణం: ప్రభాకర్‌రావు ‘‘ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాం. శరవేగంగా కొత్త సబ్ స్టేషన్లు నిర్మించాం. కొత్త లైన్లు వేశాం. అదనపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అదనంగా విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నాం. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణంలో వేగం పెంచాం. వచ్చే ఏడాదికి కొత్తగూడెం, మణుగూరు ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఇప్పటికే మూడు పాత జిల్లాల్లో సరఫరా చేస్తున్నట్లుగానే.. మిగతా అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా కరెంటు సరఫరా చేయగలమనే విశ్వాసం ఉంది’’ -
ఎంతైనా విద్యుత్ సరఫరా చేస్తాం
♦ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పష్టీకరణ ♦ ఈ నెలాఖరులోగా 10 వేల మెగావాట్ల డిమాండ్ ♦ ఆ మేర సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా నిరంతరాయంగా సరఫరా కొనసా గించేందుకు ఏర్పాట్లు చేశామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ నెల 3న రికార్డు స్థాయిలో 9,003 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని, 181 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింద న్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 6న అధికంగా 2,413 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. వేసవి తీవ్రత, రబీ అవసరాల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా విద్యుత్ డిమాండ్ 10,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని, ఆ మేర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వేసవి, రబీ పంటల అవసరాలకు తగ్గట్లు విద్యుత్ సరఫరాపై గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్, 1,180 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రస్తుతం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. అప్రమత్తంగా ఉండండి ఫీడర్ ట్రిప్పింగ్‌లతో జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు. అంతరా యాలు లేకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగి సాంకేతిక కారణాలతో సరఫరాలో అంతరాయాలు కలగవచ్చని, ఎప్పటి కప్పుడు సరఫరాను పునరుద్ధరించాలని సూచిం చారు. సిబ్బంది అందుబాటులో లేక రైతులే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు యత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదాలకు బాధ్యులుగా తేలితే స్థానిక ఏఈ, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. 16 నెలల్లో 54 కొత్త 132/33 కేవీ సబ్స్టేషన్లను నిర్మించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేశామని, ఈ విషయంలో పీజీసీఎల్ సీఎండీ స్వయంగా తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని, ఇది రాష్ట్ర విద్యుత్ శాఖకు గర్వకారణమని చెప్పారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త విద్యుత్ ప్లాంట్లు అవసరమే
నూతన ఎత్తిపోతల పథకాలు,పరిశ్రమలతో పెరగనున్న డిమాండ్ వచ్చే ఏడాది పీక్ డిమాండ్ అంచనా 17,041 మెగావాట్లు మరో మూడేళ్లలో 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం తక్కువ వ్యయంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ఈఆర్సీ బహిరంగ విచారణలో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టిందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. మూడు నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కొత్త ఎత్తిపోతల పథకాలు రానుండటంతో విద్యుత్ అవసరాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 2017–19 మధ్య ఉత్పత్తి కానున్న విద్యుత్ ధరల నిర్ధారణ కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రభాకర్‌రావు మాట్లాడారు. 2018–19లో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,041 మెగావాట్లకు పెరుగుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని అన్నారు. మరో మూడు నాలుగేళ్లలో పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశముందని చెప్పారు. పాతబడిన 3 విద్యుత్ ప్లాంట్లను మూడు నాలుగేళ్లలో మూసేయక తప్పదని, ఈ నేపథ్యంలోనే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. జెన్కో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.4.7 కోట్లకు మించడం లేదని, అదే ఇతర రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైనే ఉంటోందన్నారు. అంత విద్యుత్ అవసరమా..: నిపుణులు మూడు నాలుగేళ్లలో జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,000 మెగావాట్లకు పెంచేందుకు భారీగా కొత్త విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో అంత భారీ మొత్తంలో విద్యుత్ డిమాండ్ ఉండదని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల రావు, ఎం.తిమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల తాజా అంచనాల ప్రకారం 2017–18లో 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగిలిపోనుందని, దీంతో ఆ మేర విద్యుదుత్పత్తి తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయక తప్పదన్నారు. బ్యాకింగ్ డౌన్ చేసినా స్థిర చార్జీల రూపంలో వినియోగదారులపై రూ.వందల కోట్ల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కొత్త పీపీఏలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పీపీఏలు, నిర్మాణ వ్యయం, నిర్మాణ వ్యవధి, ఆలస్యంతో పెరిగిన వ్యయాలు తదితర వివరాలు బయటపెట్టకుండానే విద్యుత్ టారీఫ్‌పై బహిరంగ విచారణ నిర్వహించడం సరికాదన్నారు. ఈ వివరాలు లేకుండా పారదర్శకంగా టారీఫ్ నిర్థారణ సాధ్యం కాదన్నారు. కాగా, తెలంగాణ జెన్కో విద్యుత్ ధరలపై ఏపీ డిస్కంలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు హెచ్ శ్రీనివాసులు, జెన్కో డైరెక్టర్ కేఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కరెంటు కోతలుండవు
- ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు - మండుటెండల్లో నిరంతర విద్యుత్ సరఫరా - రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు హైదరాబాద్: మండుటెండలతో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవ ని, ఇకపై ఉండవని ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు 135 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు చేరుకోగా, గరిష్టంగా 165 ఎంయూల డిమాండును తీర్చగల ‘శక్తి’ సామర్థ్యాలను కలిగి ఉన్నామన్నారు. రాష్ట్రంలో డిమాండు 165 ఎంయూలకు చేరినా నిరంతరాయంగా సరఫరా చేయగలమన్నారు. ఎండలు పదునెక్కిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభాకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పై విషయాలను తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన తెలిపారు. వాతావరణంలో వేడి వల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతోనే అక్కడక్కడ సరఫరాలో అంతరాయం వస్తోందన్నారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో సంతృప్తికర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. అన్ని సబ్స్టేషన్లు వినియోగంలోకి... పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్లను తక్షణమే ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభాకర్‌రావు డిస్కంలను ఆదేశించారు. జంట నగరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించేందుకు ఎర్రగడ్డలోని 220/132 కేవీ సబ్ స్టేషన్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ట్రాన్స్‌కో అధికారులను కోరారు. మరమ్మతు అవసరాల కోసం అదనపు బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బదిలీల నిలుపుదల ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సాధారణ బదిలీలను నిలిపివేయాలని ఎస్పీడీసీఎల్కు ప్రభాకర్‌రావు సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.