డైరీని ఆవిష్కరిస్తున్న రఘుమారెడ్డి, ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘సాంకేతిక సామర్థ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర డిస్కంల కంటే ముందున్నా...ఆర్థికంగా కొంత వెనుకబడిపోయాయి. నష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆయా పంపిణీ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు గట్టెక్కాలంటే మీటర్ సేల్స్ పెంచాలి. అంతర్గత వృథా ఖర్చులు తగ్గించుకోవాలి’ అని తెలంగాణ విద్యుత్ (టాన్స్‌కో,జెన్‌కో) సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డా రు.
శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ అఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ–2023 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు కొంత మెరుగ్గా ఉన్నా.. పంపిణీ సంస్థలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి. ప్రభుత్వం అనేక విధాలుగా సహకరిస్తున్నా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నష్టాల్లో ఉన్న సంస్థలను ఇక లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది. లేదంటే సంస్థల మనుగడే కాదు ఉద్యోగుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం రోజుకో రకమైన సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. విద్యుత్ సంస్థలకు ఈ క్రైం సవాల్ విసురుతోంది. ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.
సైబర్ నేరగాళ్లకు సంస్థలు చిక్కకుండా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆర్థిక వనరులు వారి చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది. అకౌంటెంట్లు కేవలం అకౌంట్స్‌ను నిర్వహించడమే కాదు బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెన్ చేయాలి. సంస్థ ఖాతాలో నిల్వలు ఉన్నప్పుడే అవసరానికి, అభివృద్ధి పనులకు బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. నిల్వలు లేక పోతే అప్పులు కూడా పుట్టవు.’అని సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.
ఆ డబ్బులు సొంతానికి వాడుకుంటే ఎలా? సీఎండీ రఘుమారెడ్డి
‘వినియోగదారుల నుంచి వసూలు చేసిన విద్యుత్ బిల్లులను, వెంటనే సంస్థ ఖాతాలో జమ చేయడం లేదు. వీటిని కొంత మంది ఉద్యోగులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. వరుస డోర్‌లాక్‌లు, మీటర్ స్టకప్‌లు వంటి అంశాలను ఈఆర్‌ఓలు మానిటరింగ్ చేయడం లేదు. పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకుంటే ఎలా?
ఈఆర్‌ఓ కేంద్రాల్లోని అకౌంటెంట్లు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు బిల్లులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా..? ఈఆర్‌ఓ కో ఆర్డినేషన్ మీటింగ్‌లో ఏం చర్చిస్తున్నారు? అన్‌బిల్డ్ సర్వీసులపై ఎందుకంత నిర్లక్ష్యం? ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సర్వీసులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. సెక్షన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, వృధా ఖర్చులు, విద్యుత్ లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత అకౌంటెంట్లపైనే ఉంది’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, జెన్‌కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నరసింహ్మారావు, టీఆర్‌కే రావు, తిరుపతిరెడ్డి, వీఏఓఏటీ అధ్యక్షుడు ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment