
‘‘నేను గత రెండేళ్లుగా డైరీ రాస్తున్నాను. నా జీవితంలో డైరీ రాయడం ఓ గేమ్ చేంజర్‌లా మారింది. మీరూ రాయడానికి ప్రయత్నించండి’’ అంటున్నారు హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) . కాగా విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు సమంత.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు సమంత. ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.‘‘డైరీ రాయడం అనేది పాత పద్ధతే. కానీ, రాస్తే మాత్రం మనకు ఓ తీయని జ్ఞాపకంగా ఉంటుంది. నేను గత రెండేళ్లుగా డైరీ రాసే ఆచారాన్ని పాటిస్తున్నాను. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏం రాయాలో అర్థం కాదు.
కానీ, ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాస్తే... మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. నేను కూడా నాకు కష్టమైన, కష్టం అనిపించిన క్షణాల్లో కొన్నింటిని డైరీలో రాశాను. డైరీ రాయడం అనేది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలగడానికి చాలా ఉపయోగపడింది. చెప్పాలంటే డైరీ రాయడం నాకో గేమ్ చేంజర్‌లా మారింది. అందరూ రాయడం ప్రయత్నించండి... ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’’ అంటూ పోస్ట్ చేశారు సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment