సాగుకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ | Farm sector will get 24-hour power supply : Transco CMD Prabhakar Rao | Sakshi
Sakshi News home page

సాగుకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌

Published Mon, Nov 6 2017 1:58 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

Farm sector will get 24-hour power supply : Transco CMD Prabhakar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి తాత్కాలికంగా ఐదు రోజుల పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాత మూడు జిల్లాల పరిధిలో సాగుకు 24 గంటల పాటు కరెంట్‌ సరఫరా చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి గతేడాది కాలంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కొలిక్కి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంట్‌ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ ఆదివారం జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో చర్చించారు.

ఐదు రోజుల తర్వాత ప్రభావాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా సీఎంకు ప్రతిపాదించారు. ఇందుకు సీఎం ఆమోదముద్ర వేశారు. జిల్లాలు, డివిజన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా ప్రభావాన్ని అంచనా వేయాలని, ఐదు రోజుల పాటు ప్రతీక్షణం సంబంధిత అధికారులు పరిస్థితిని గమనించాలని సూచించారు. తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించుకుని, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. సీఎంతో సమీక్ష అనంతరం ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీÜఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు నర్సింగ్‌రావు, జగత్‌రెడ్డిలతో ప్రభాకర్‌రావు చర్చించారు. 

అదనంగా 2 వేల మెగావాట్ల డిమాండ్‌ 
ఈ ఏడాది జూన్‌ 17 నుంచి పాత మెదక్‌ జిల్లా పరిధిలో, జూన్‌ 18 నుంచి పాత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగుకు 24 గంటల కరెంట్‌ అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద 23 లక్షలకు పైగా పంపుసెట్లు ఉంటే.. ఈ మూడు జిల్లాల పరిధిలో 9.58 లక్షల పంపుసెట్లున్నాయి. అంటే దాదాపు 43 శాతం పంపుసెట్లకు 24 గంటల కరెంట్‌ను విజయవంతంగా సరఫరా చేసినట్లు విద్యుత్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకు గరిష్టంగా 9,500 మెగావాట్ల డిమాండ్‌కు సరిపడ విద్యుత్‌ అందించాయి. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలోని మొత్తం 23 లక్షలకు పైగా ఉన్న పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను విస్తరిస్తారు. ఇందుకు అదనంగా మరో 1500–2000 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అంచనా వేశారు. 

24 గంటల కరెంట్‌ నా స్వప్నం: కేసీఆర్‌ 
‘‘సమైక్య రాష్ట్రంలో మూడు నాలుగు గంటల కరెంట్‌ కూడా అందలేదు. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పడగానే విద్యుత్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాం. రైతులందరికీ 24 గంటల కరెంట్‌ ఇవ్వాలన్నది నా స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి కష్టపడుతున్న విద్యుత్‌ ఉద్యోగులందరికీ అభినందనలు. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. రైతులు బంగారు పంటలు పండించగలుగుతారు. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసే 24 గంటల కరెంటు సరఫరా తప్పక విజయవంతమవుతుంది’’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో అన్నారు. 

విద్యుత్‌ సంస్థలకు గర్వకారణం: ప్రభాకర్‌రావు 
‘‘ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాం. శరవేగంగా కొత్త సబ్‌ స్టేషన్లు నిర్మించాం. కొత్త లైన్లు వేశాం. అదనపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అదనంగా విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నాం. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణంలో వేగం పెంచాం. వచ్చే ఏడాదికి కొత్తగూడెం, మణుగూరు ప్లాంట్లు విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఇప్పటికే మూడు పాత జిల్లాల్లో సరఫరా చేస్తున్నట్లుగానే.. మిగతా అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా కరెంటు సరఫరా చేయగలమనే విశ్వాసం ఉంది’’  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement