సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ పేరుతో దేవాలయ ఉద్యోగులు, పూజారుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవాదాయ శాఖలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ తామే చేయించామని, అందుకు ప్రతీ ఒక్క లబ్ధిదారుడు నిర్ధారిత మొత్తం ఇవ్వాలని కొందరు నమ్మబలికారు.
లేకపోతే జాబితా నుంచి పేరు గల్లంతు చేస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ ఉదంతంపై ‘దక్షిణ సమర్పయామి’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో అలజడి సృష్టించింది. విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఎందుకు గుర్తించలేదని ఆ శాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాల వారీగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అర్హులైన ఉద్యోగులు, అర్చకుల జాబితా ఆధారంగా వేతన సవరణ చేస్తున్నందున మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరు కూడా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాలని పేర్కొన్నారు. కాగా, వేతన సవరణ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరపాలని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment