temple employees
-
‘దక్షిణ సమర్పయామి’పై సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ పేరుతో దేవాలయ ఉద్యోగులు, పూజారుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవాదాయ శాఖలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ తామే చేయించామని, అందుకు ప్రతీ ఒక్క లబ్ధిదారుడు నిర్ధారిత మొత్తం ఇవ్వాలని కొందరు నమ్మబలికారు. లేకపోతే జాబితా నుంచి పేరు గల్లంతు చేస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ ఉదంతంపై ‘దక్షిణ సమర్పయామి’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో అలజడి సృష్టించింది. విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఎందుకు గుర్తించలేదని ఆ శాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాల వారీగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులు, అర్చకుల జాబితా ఆధారంగా వేతన సవరణ చేస్తున్నందున మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరు కూడా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాలని పేర్కొన్నారు. కాగా, వేతన సవరణ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరపాలని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. -
దుర్గ గుడి వద్ద కత్తితో మహిళ హల్చల్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మహా మండపం వద్ద కత్తి పట్టుకుని ఓ మహిళ హల్చల్ చేసింది. మతిస్థిమితం లేని ఓ గుర్తుతెలియని మహిళ మూడు రోజులుగా మహా మండపం పరిసరాల్లో తిరుగుతున్నట్లు శానిటరీ సిబ్బంది పేర్కొన్నారు. అయితే బుధవారం ఆ మహిళ ప్రవర్తనలో తీవ్ర మార్పు రావడమే కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని దూషించడం ప్రారంభించింది. క్యూలైన్ మెట్లపై కూర్చొన్న భక్తులను తిడుతుండటంతో వారు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళ మానసిక స్థితి సరిగా లేదని గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే మహిళను అక్కడ నుంచి దూరంగా తరలించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మహిళ వద్ద ఉన్న మూడు బ్యాగులను పరిశీలించగా చాకు కనిపించింది. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవరావు అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న భాస్కరరావుకు విషయం చెప్పడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మహిళ వల్ల భక్తులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భావనతో వెంటనే ఆమెను ఆటోలో దేవస్థానానికి దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళను ఆటోలో తరలిస్తుండగా కూడా ఆలయ సిబ్బందిని దూషిస్తూనే ఉంది. -
కమిటీ.. ఉత్తదే!
సాక్షి, హైదరాబాద్: ఒక అంశంపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తే.. అది నివేదిక ఇచ్చే వరకు ఆ అంశంపై ప్రభుత్వం సాధారణంగా కీలక నిర్ణయం తీసుకోదు. ఒకవేళ తీసుకుందంటే.. కమిటీ నివేదిక బుట్టదాఖలుతో సమానమనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ఉద్యోగులు, అర్చకుల వేతనాల విషయంలో సర్కారు ఇలాగే వ్యవహరించింది. చాలాకాలంగా చాలీచాలని వేతనాలతో భద్రత లేని జీవితాలు గడుపుతున్నందున తమకు ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించాలంటూ కొద్దిరోజుల క్రితం దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ సమ్మెబాట పట్టింది. దీంతో ఆ విషయంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమ్మెను విరమింపజేసింది. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ప్రభుత్వం మూడు రోజుల క్రితం దేవాలయ సిబ్బందికి పదో పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన తరహాలోనే ఫిట్మెంట్ అమలు చేస్తామన్నది దీని సారాంశం. కానీ దేవాలయాల ఆదాయంలో ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 30 శాతం మించకుంటేనే ఇది వర్తిస్తుందనే నిబంధన ఉండటంతో ఈ వేతన సవరణ ఎందుకూ కొరగాకుండా పోయింది. వేళ్లమీద లెక్కించే కొన్ని మినహా అన్ని ఆలయాల్లో ఇప్పటికే 30 శాతం పరిధి ఎప్పుడో దాటిపోయింది. ఆర్జేసీ కేడర్ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలను ఈ నిబంధన నుంచి మినహాయించారు. కమిటీతో సంబంధం లేకుండా వేతన సవరణ చేయటంపట్ల ఉద్యోగులు, అర్చక సంఘం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని దేవాలయాలను 30 శాతం నిబంధన నుంచి మినహాయించటం, ఆలయాల నుంచి వస్తున్న ఆదాయం నుంచి దేవాదాయ శాఖ కార్యాలయంలోని ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు చెల్లించటం లాంటి విషయాలపై వారు మండిపడుతున్నారు. దీనిపై మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
ధూపదీప నైవేద్యాలకు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్‌లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం కేసీఆర్ దీనికి సానుకూలత వ్యక్తం చేసినా.. ఉత్తర్వు మాత్రం వెలువడలేదు. తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మెకు దిగిన నేపథ్యంలో దీనికి కూడా మోక్షం లభించింది. సమ్మె విరమణ కోసం శుక్రవారం రాత్రి అర్చక సంఘం, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు జరిపిన సందర్భంలో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఖజానా నుంచి వేతనాలు చెల్లించే విషయంలో కమిటీని వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రధాన హామీలకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌ను కలసి వివరించారు. స్వయంగా తాను ఇచ్చిన హామీ కావటంతో ధూపదీప నైవేద్యాల మొత్తం పెంచే అంశాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఖజానా వేతనాలపై కమిటీ ఏర్పాటు చేసి నెలరోజుల్లో నివేదిక అందజేసేలా ఆదేశించాలని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరుస్తాం: ఇంద్రకరణ్ అర్చకుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్చకులకు, దేవాదాయశాఖ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ అధ్యయనానికి కమిటీ వేస్తున్నామని, రెండు నెలల్లో దాన్ని కొలిక్కి తెస్తామన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఐదు జిల్లాలో చేస్తున్న పనులు 75 శాతం పూర్తయ్యాయని, జూలై తొలివారం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అర్చకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఖజానా వేతనాలపై కమిటీ అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, రెవెన్యూ(దేవాదాయ) ఉప కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణారావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. జూన్ చివరి నాటికి కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. -
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
హైదరాబాద్: ఇక నుంచి ఆలయాల్లో దీపదూప నైవేధ్యాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, జూన్ 2 నుంచి పెంచిన వేతన అమలులోకి వస్తుందని శనివారం ఆయన తెలిపారు. వారికి గౌరవ వేతనం రూ.6 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం
విజయవాడ: కనకదుర్గ ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. ఈ ఘటన గురువారం కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ గుడి హుండీ లెక్కింపులో భాగంగా చోటుచేసుకుంది. వివరాలు... యథావిధిగా ఆలయ అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కాగా లెక్కింపులో హుండీ నుంచి బంగారు మంగళసూత్రాలు చోరీ చేశారు. దాంతో లెక్కింపు సిబ్బంది పనేనని గ్రహించిన ఆలయ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.