సాక్షి, హైదరాబాద్: ఒక అంశంపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తే.. అది నివేదిక ఇచ్చే వరకు ఆ అంశంపై ప్రభుత్వం సాధారణంగా కీలక నిర్ణయం తీసుకోదు. ఒకవేళ తీసుకుందంటే.. కమిటీ నివేదిక బుట్టదాఖలుతో సమానమనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ఉద్యోగులు, అర్చకుల వేతనాల విషయంలో సర్కారు ఇలాగే వ్యవహరించింది. చాలాకాలంగా చాలీచాలని వేతనాలతో భద్రత లేని జీవితాలు గడుపుతున్నందున తమకు ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించాలంటూ కొద్దిరోజుల క్రితం దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ సమ్మెబాట పట్టింది.
దీంతో ఆ విషయంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమ్మెను విరమింపజేసింది. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ప్రభుత్వం మూడు రోజుల క్రితం దేవాలయ సిబ్బందికి పదో పీఆర్‌సీని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన తరహాలోనే ఫిట్‌మెంట్ అమలు చేస్తామన్నది దీని సారాంశం. కానీ దేవాలయాల ఆదాయంలో ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు 30 శాతం మించకుంటేనే ఇది వర్తిస్తుందనే నిబంధన ఉండటంతో ఈ వేతన సవరణ ఎందుకూ కొరగాకుండా పోయింది.
వేళ్లమీద లెక్కించే కొన్ని మినహా అన్ని ఆలయాల్లో ఇప్పటికే 30 శాతం పరిధి ఎప్పుడో దాటిపోయింది. ఆర్జేసీ కేడర్ ఆలయాలైన యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలను ఈ నిబంధన నుంచి మినహాయించారు. కమిటీతో సంబంధం లేకుండా వేతన సవరణ చేయటంపట్ల ఉద్యోగులు, అర్చక సంఘం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని దేవాలయాలను 30 శాతం నిబంధన నుంచి మినహాయించటం, ఆలయాల నుంచి వస్తున్న ఆదాయం నుంచి దేవాదాయ శాఖ కార్యాలయంలోని ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు చెల్లించటం లాంటి విషయాలపై వారు మండిపడుతున్నారు. దీనిపై మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కమిటీ.. ఉత్తదే!
Published Sun, Aug 16 2015 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement