సాక్షి, హైదరాబాద్: గౌరవ భృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం, పేద అర్చకుల పూట గడవటం కష్టంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ భృతి బకాయిల కోసం వేడుకుంటున్నా ఫలితం లేదు. దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు. మంగళవారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు.
ఇదీ సంగతి: ఆదాయం అంతగా లేక ఆలనాపాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘ధూప దీపనైవేద్య పథకం’ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతోపాటు గౌరవ భృతి మొత్తం కూడా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 6000 దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. తొలుత 3500 దేవాలయాలకు మాత్రమే ఉండగా, గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మరో 2500 దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఆమేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూపదీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ భృతి రూ.6500 ఉండగా, దానిని కూడా రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ అప్పడు ప్రకటించారు. కొద్దిరోజులకు ఆమేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గౌరవ భృతి రూ.10 వేలకు పెరిగింది. అప్పటి వరకు రూ.6500 చెల్లిస్తున్న ఆలయాలకు కూడా వర్తింపజేశారు. కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు. కానీ, కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు.
కొత్త ప్రభుత్వం కొలువు దీరటంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. పాత దేవాలయాలకు సంబంధించి నవంబరు నుంచి బకాయిలు పేరుకుపోగా, కొత్తగా చేరిన దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విన్నవించినట్టు ఆర్చకులు చెబుతున్నారు.
దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు. దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్నా ఫలితముంటుందన్న ఉద్దేశంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment