Illegally collecting money
-
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్‌ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
‘దక్షిణ సమర్పయామి’పై సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ పేరుతో దేవాలయ ఉద్యోగులు, పూజారుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవాదాయ శాఖలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ తామే చేయించామని, అందుకు ప్రతీ ఒక్క లబ్ధిదారుడు నిర్ధారిత మొత్తం ఇవ్వాలని కొందరు నమ్మబలికారు. లేకపోతే జాబితా నుంచి పేరు గల్లంతు చేస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ ఉదంతంపై ‘దక్షిణ సమర్పయామి’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో అలజడి సృష్టించింది. విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఎందుకు గుర్తించలేదని ఆ శాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాల వారీగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులు, అర్చకుల జాబితా ఆధారంగా వేతన సవరణ చేస్తున్నందున మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరు కూడా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాలని పేర్కొన్నారు. కాగా, వేతన సవరణ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరపాలని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. -
మామూళ్లు తీసుకోం
పోలీసు సిబ్బంది ప్రతిజ్ఞ అక్రమ వసూళ్లు నా దృష్టికి తీసుకురండి ప్రజలకు కమిషనర్ సూచన సిటీబ్యూరో: ‘అక్రమంగా డబ్బులు వసూలు చేసే రోడ్డు మాస్టర్లు, కలెక్షన్ కింగ్‌ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి.. మామూళ ్లను బంద్ చేస్తామ’ని సైబరాబాద్ ఇన్స్పెక్టర్లు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారిలా ప్రతినబూనారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైన్ షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు, సాధారణ వ్యాపారులు పోలీసు సిబ్బందికి, అధికారులకు లంచాలు ఇవ్వవద్దని సూచించారు. ఎవరైనా మామూళ్లు ఇచ్చినట్లు... పోలీసులు తీసుకున్నట్లు తెలిస్తే తమ వాట్సప్ నెంబర్ 94906 17444కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ నెంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపించవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్ నిర్వహణకు నెలకు రూ.75 వేల వంతున ఇస్తోందని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తున్నందున స్టేషన్ పరిధిలో ఏ పోలీసు కూడా మామూళ్లు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేసి దేశంలోనే ఉత్తమ పోలీసులుగా మనం పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రతి పోలీసు స్టేషన్‌ను స్మార్ట్ అండ్ క్లీన్‌గా చేస్తామన్నారు. దీనికోసం స్టేషన్‌కు ఇద్దరి నుంచి ఆరుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నామని ఆయన వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, జోన్ల్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ కార్యాలయాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి కసర త్తు చేస్తున్నట్టు చెప్పారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానిక సంక్షేమ సంఘాల నేతలు, బస్తీ, కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.వి.శశిధర్‌రెడ్డి, డీసీపీలు కార్తీకేయ, ఎఆర్ శ్రీనివాస్, డాక్టర్ షేముషీ వాజ్‌పేయి, డాక్టర్ బి.నవీన్‌కుమార్, తఫ్సీర్ ఎక్బాల్, అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఇ.రాంచంద్రారెడ్డి, మద్దిలేటి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యచరణ్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.