పోలీసు సిబ్బంది ప్రతిజ్ఞ
అక్రమ వసూళ్లు నా దృష్టికి తీసుకురండి
ప్రజలకు కమిషనర్ సూచన
సిటీబ్యూరో: ‘అక్రమంగా డబ్బులు వసూలు చేసే రోడ్డు మాస్టర్లు, కలెక్షన్ కింగ్‌ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి.. మామూళ ్లను బంద్ చేస్తామ’ని సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్లు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారిలా ప్రతినబూనారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైన్ షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు, సాధారణ వ్యాపారులు పోలీసు సిబ్బందికి, అధికారులకు లంచాలు ఇవ్వవద్దని సూచించారు. ఎవరైనా మామూళ్లు ఇచ్చినట్లు... పోలీసులు తీసుకున్నట్లు తెలిస్తే తమ వాట్సప్ నెంబర్ 94906 17444కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ నెంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపించవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్ నిర్వహణకు నెలకు రూ.75 వేల వంతున ఇస్తోందని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తున్నందున స్టేషన్ పరిధిలో ఏ పోలీసు కూడా మామూళ్లు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేసి దేశంలోనే ఉత్తమ పోలీసులుగా మనం పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రతి పోలీసు స్టేషన్‌ను స్మార్ట్ అండ్ క్లీన్‌గా చేస్తామన్నారు.
దీనికోసం స్టేషన్‌కు ఇద్దరి నుంచి ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నామని ఆయన వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, జోన్‌ల్ టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ కార్యాలయాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి కసర త్తు చేస్తున్నట్టు చెప్పారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానిక సంక్షేమ సంఘాల నేతలు, బస్తీ, కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.వి.శశిధర్‌రెడ్డి, డీసీపీలు కార్తీకేయ, ఎఆర్ శ్రీనివాస్, డాక్టర్ షేముషీ వాజ్‌పేయి, డాక్టర్ బి.నవీన్‌కుమార్, తఫ్సీర్ ఎక్బాల్, అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఇ.రాంచంద్రారెడ్డి, మద్దిలేటి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యచరణ్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
మామూళ్లు తీసుకోం
Published Tue, Feb 24 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement