సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ ఆదివారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. ప్రస్తుత వేతన సవరణ గడువు 14 నెలల క్రితమే ముగిసిపోయినందున కొత్త వేతన సవరణను ప్రకటించాలని కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతన సవరణలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే 25% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన సంఘాలన్నీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా అందజేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది.
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఆర్టీసీలో వేతన సవరణ అంశాన్ని కూడా దానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో కూడిన కమిటీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రాయం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. మొత్తంగా 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment