సమ్మెకే సై! | RTC unions to strike over pay revision | Sakshi
Sakshi News home page

సమ్మెకే సై!

Published Sat, Jun 9 2018 1:24 AM | Last Updated on Sat, Jun 9 2018 9:52 AM

RTC unions to strike over pay revision - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ వేతనాల సవరణపై స్పష్టమైన హామీ వచ్చేదాకా వెనక్కి తగ్గబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ముందుగా ప్రకటించినట్టుగా 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని మరోసారి తేల్చిచెప్పాయి. ప్రభుత్వం అణచివేసే ధోరణితో వ్యవహరిస్తే బెదిరిపోయేది లేదని పేర్కొన్నాయి. శుక్రవారం మంత్రి మహేందర్‌రెడ్డి, కార్మిక శాఖ అధికారులతో వేర్వేరుగా జరిగిన భేటీల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈ అంశాలను స్పష్టం చేశారు.

అయితే శనివారం ఉదయం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామని గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ మంత్రికి చెప్పిన నేపథ్యంలో సమ్మెను కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అద్దె బస్సులు, అవసరమయ్యే డ్రైవర్లను సమకూర్చుకోవటం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

మంత్రితో భేటీలోనూ..
ఆర్టీసీ సమ్మె అంశంపై సీఎం కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రి మహేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలను వారి దృష్టికి తెచ్చా రు. సంస్థ శ్రేయస్సు దృష్ట్యా సమ్మె యోచనను విరమించుకోవాలని కోరారు.

ఆర్టీసీ పరిరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వివిధ రాష్ట్రాల్లో ఆర్టీసీల పరిస్థితిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుం టామని వివరించారు. దీంతో శనివారం తమ సం ఘం సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి తుది నిర్ణయం చెబుతామని గుర్తింపు కార్మిక సంఘం నేతలు మంత్రికి చెప్పారు. అయితే ఇతర సంఘాల నేతలు మాత్రం భేటీ అనంతరం విడిగా విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో పునరాలోచన లేదని ప్రకటించారు.

రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్న కార్మిక శాఖ
కార్మికశాఖ ఉప కమిషనర్‌ గంగాధర్‌ సమ్మె అంశంపై శుక్రవారం సాయంత్రం కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.  కార్మిక శాఖతో చర్చలు జరిగి విఫలమైతే.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఏడు రోజుల తర్వాతే సమ్మె చేయాల్సి ఉంటుందన్నారు. ఈలోపే సమ్మె చేపడితే ఆయా సంఘాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు.

సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోపు కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించాల్సి ఉంటుందని, కానీ ఇప్పుడు 20 రోజులు దాటాక చర్చలకు పిలిచినందున ఆ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి పరిష్కారం లేకుండానే భేటీ ముగిసింది. ఈ నెల 14న మరోసారి చర్చలకు రావాలని ఉప కమిషనర్‌ సూచించగా తాము 11న సమ్మె ప్రారంభిస్తున్నందున వచ్చేది లేదని నేతలు స్పష్టం చేశారు.

టీఎంయూ నేతల మాటలపై సీఎం ఆగ్రహం
ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి అనధికార అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. అనూహ్యంగా రెండు మూడు నెలల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపై టీఎంయూ నేతలు అంతర్గత సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. వేతన సవరణ సమావేశాల్లో కూడా హరీశ్‌ టీఎంయూకు మద్దతుగా ముందుకు రాలేదు.

తెలంగాణ ఉద్యమా న్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపారని, తమ సహకారంతోనే పలువురు నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని, తెలంగాణనే రాకుంటే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి ఎలా వచ్చేదని వారు పేర్కొన్నట్టు సమాచారం. ఇవన్నీ సీఎం కేసీఆర్‌కు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారని, గత వేతన సవరణ సమయంలో ఉదారంగా వ్యవహరించిన సీఎం ఇప్పు డు కఠినంగా ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది.

సీఎం తీరుపై బీజేపీ ఫైర్‌..
ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి హెచ్చరికలు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.  టీఎంయూ నేతలు బీజేపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, అందుకే బీజేపీ వారికి అనుకూలంగా మాట్లాడుతోందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు మొదలుపెట్టారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. అద్దె బస్సులతోపాటు ప్రైవేటు డ్రైవర్లను తాత్కాలిక పద్ధతిపై తీసుకుని బస్సులు నడుపుతాం. ప్రయాణికుల ఇబ్బంది, ఆర్టీసీ నష్టాల నేపథ్యంలో సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కార్మికులు మొండిగా ముందుకెళితే ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది..’’ – రమణారావు, ఆర్టీసీ ఎండీ

సమ్మె తప్పదు
‘‘కార్మికులను రక్షించాలని చట్టాలు చెబుతున్నా.. కార్మిక శాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. మా డిమాండ్లపై సానుకూల స్పందన రాకుంటే సమ్మె కొనసాగించి తీరుతాం. సమ్మెలపై నిషేధం ఉందని కార్మిక శాఖ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉంది. నిషేధం ఉన్నప్పటికీ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు వెనకడుగు వేయలేదని గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కూడా సమ్మె నిర్వహించి తీరుతాం..’’ – అశ్వత్థామరెడ్డి,టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వ వైఫల్యాలతో నష్టాలు
‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. మూడేళ్లుగా డీజిల్‌ ధరలు 50 శాతం పెరిగాయి. కానీ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచడం లేదు. అడ్డగోలుగా ప్రైవేటు వాహనాలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. దాంతో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోంది.

మా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తామంటుంటే.. ఉద్యోగాలు పీకేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించడం దారుణం. ఈ బెదిరింపులకు భయపడేది లేదు..’’ – కె.రాజిరెడ్డి, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement