తమ వేతనాల సవరణపై స్పష్టమైన హామీ వచ్చేదాకా వెనక్కి తగ్గబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ముందుగా ప్రకటించినట్టుగా 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని మరోసారి తేల్చిచెప్పాయి. ప్రభుత్వం అణచివేసే ధోరణితో వ్యవహరిస్తే బెదిరిపోయేది లేదని పేర్కొన్నాయి. శుక్రవారం మంత్రి మహేందర్‌రెడ్డి, కార్మిక శాఖ అధికారులతో వేర్వేరుగా జరిగిన భేటీల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈ అంశాలను స్పష్టం చేశారు.
అయితే శనివారం ఉదయం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామని గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ మంత్రికి చెప్పిన నేపథ్యంలో సమ్మెను కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అద్దె బస్సులు, అవసరమయ్యే డ్రైవర్లను సమకూర్చుకోవటం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు.